Maha Shivarathri Celebrations 2024 : దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా భారత సంస్కృతిని చాటే పండుగలను నిర్వహించడంలో కలిసి కట్టుగా ఉంటారు. అన్ని వేడుకలకు కేంద్రంగా న్యూ జెర్సీలోని ‘సాయిదత్త పీఠం’ నిలుస్తుంది. ఈ పీఠం ఆధ్వర్యంలో శ్రీ శివ విష్ణు దేవాలయం కొనసాగుతోంది. ఆలయంలో ప్రతీ రోజు నిత్య పూజలతో సహా.. భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక భారతీయ సంప్రదాయం ప్రకారం.. పండుగలను నిర్వహిస్తూ అయ్యప్ప, హనుమాన్ మాలాధారణ చేపడుతారు. ఆలయ పూజారులు భక్తులను ప్రోత్సహిస్తూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ, విస్తరిస్తున్నారు.
ఇందులో భాగంగా మార్చి 8 (మహా శివరాత్రి)ని పురస్కరించుకొని ఆలయంలో వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచి మహా శివుడికి ప్రతీకైన లింగానికి, విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు. అభిషేకాల అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు న్యూజెర్సీతో పాటు యూఎస్ లోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకొని నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇక, రాత్రి మహా శివుడికి జాగరణ నిర్వహించారు. భక్తులు ఒక్కపొద్దులు ఉండడంతో పాటు రాత్రి స్వామి వారిని కొలుస్తూ తెల్లవార్లూ జాగరణ నిర్వహించారు. భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. శివరాత్రి విశిష్టతను భక్తులకు వివరిస్తూ ప్రముఖులు ప్రసంగాలు చేశారు. శుక్రవారం రోజు శ్రీ సాయి దత్తపీఠం ఆధ్వర్యంలోని శ్రీ శివ విష్ణు దేవాలయంలో సందడి నెలకొంది.
All Images Courtesy by Dr. Shiva Kumar Anand
More Images : Maha Shivarathri Celebrations 2024 at SDP SSV Temple