Niharika Konidela : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీలు తమ వ్యూహాలకు పదునెక్కిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నాయి. రెండో సారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో వైసీపీ ఆచితూచి అడుగులు ముందుకు వేస్తుంటే..జగన్ ను గద్దె దించడమే ధ్యేయంగా టీడీపీ, జనసేన పనిచేస్తున్నాయి. ఈ కూటమితో బీజేపీ దోస్తీ చేస్తుందా లేదా అనేది రేపటిలోగా తెలియనుంది.
ఇక కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల నేతృత్వంలో జగన్ ఢీకొట్టేందుకు రెడీ అయిపోయింది. బలమైన అభ్యర్థులు, గెలుపు గుర్రాలనే బరిలో దించాలని భావిస్తోంది. అన్ని పార్టీలకు ఈ సారి ఎన్నికలకు కీలకం కాబోతున్నాయి. పార్టీలు, వాటి అధినేతల తలరాతలు మార్చే ఎన్నికలు కాబోతున్నాయి. అందుకే అందరూ ‘డూ ఆర్ డై’ అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు.
అంగ, అర్థబలం ఉన్న నాయకులను, ప్రజాక్షేత్రంలో మంచి పేరున్న నాయకులను పార్టీలు తమ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య పోరాటం మనకు తెలిసిందే గాని.. ఈ ఎన్నికల్లో చావోరేవో అన్నట్టుగా జనసేన తేల్చుకునే పనిలో పడింది. జనసేన పార్టీ పెట్టి పదేళ్లయినా ఏపీ రాజకీయాల్లో ఇంతవరకు ఏ ప్రభావం చూపలేదు. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఈసారి ఎన్నికల్లో అలాంటి పరిస్థితి ఎదురుకావొద్దని ఆ పార్టీ తన శక్తియుక్తుల్ని అన్నింటిని పణంగా పెడుతోంది.
ఈసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న జనసేన కోసం, పవన్ కల్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. రాజకీయాల్లో కష్టపడుతున్న పవన్ కోసం తాము ఉన్నామని చెబుతున్న కొణిదెల నిహారిక బాబాయ్ కోసం ఏపీలో ప్రచారం చేస్తానని స్పష్టం చేసింది. గతంలో కూడా బాబాయ్ కోసం తాను ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని, తన ఓటు సైతం ఏపీలోనే ఉందని వెల్లడించింది.
మొత్తానికి బాబాయ్ పవన్ కల్యాణ్ కోసం మెగా డాటర్ నిహారిక ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్నట్టు చెప్పడం జనసైనికులకు ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈసారి మెగా ఫ్యామిలీ అంతా వచ్చి పవన్ కు మద్దతుగా ప్రచారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు.