
Ponguleti srinivas : తెలంగాణ రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంపై రోజుకో వార్త వెలువడుతూనే ఉంది. పొంగులేటిని బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేసినప్పటి నుంచి ఆయన ఆ పార్టీలో చేరతారు ఈ పార్టీలో చేరతారు అంటూ వాదనలు వినిపించాయి. టీవీల్లో డిబేట్లు సైతం కొనసాగాయి. తమ పార్టీలోకే అంటూ ఇటు బీజేపీ, లేదు తమ పార్టీలోకే అంటూ అటు కాంగ్రెస్ టగ్ ఆఫ్ వార్ నిర్వహించారు.
ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి 11,974 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు. అయితే ఇదే సంవత్సరం (2023)లో బీఆర్ఎస్ నుంచి ఆయనను సీఎం కేసీఆర్ సస్పెండ్ చేశారు. ఆయన చేరికపై పార్టీలు, ఆయన అనుచరులు చాలా పుకార్లు పుట్టించారు. అయితే ఈ సారి ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై గెలిచి కేసీఆర్ పై పగ తీర్చుకోవాలన్నదే సంకల్పంగా పెట్టుకున్నాడు పొంగులేటి.
ఎన్నికల సమయం వరకూ ఏ పార్టీలో చేరతామనేది చెప్తామని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే కర్ణాటక ఫలితాలు చూసిన ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. కర్ణాటకలో ఊపు మీదున్న పార్టీ ఇక్కడ కూడా గెలుపు సాధిస్తుందని అందుకే అందులో చేరాలని ఆయన అనుకుంటున్నట్లు తెలిసింది. తనను తొలగించిన సమయంలో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ నేతలు ఎవ్వరినీ అసెంబ్లీ గేటు వరకు రానివ్వనని ఆయన శపథం చేశారు. అందుకే వచ్చే ఎన్నికలను ఆయన సీరియస్ గా తీసుకుంటారని తెలుస్తుంది.
ఖమ్మం జిల్లాలో బీజేపీ కంటే కాంగ్రెస్ కు పట్టు ఉండడంతో పొంగులేటి అందులోనే చేరితే లాభం జరుగుతుందని స్థానికంగా, ఆయన అనుచరుల్లోనూ చర్చ జరుగుతుంది. కేసీఆర్ వ్యతిరేకులంతా తమ వెంట రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో పొంగులేటి, ఆయనతో పాటు జూపల్లి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన చేరికపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు సమాచారం. జూన్ 2 లేదా 8వ తేదీ ఆయన పార్టీలోకి వెళ్లాలని ముహూర్తం పిక్స్ చేసుకున్నారని ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలపై శ్రీనివాస్ రెడ్డి స్పందించలేదు.