Remember ANR : అక్కినేని నాగేశ్వర్ రావు గురించి ప్రస్తుత జనరేషన్ కు అవగాహన లేకున్నా.. 80 వారికి మాత్రం ఆరాధ్య హీరో. ఏఎన్నార్ గా పిలువబడే నాగేశ్వర్ రావు రెండు తరాలను కవర్ చేసి మరీ సినిమాలు చేశారు. ఎన్టీఆర్ తో పోటీ పడి మరీ నటించే వారు. ఇద్దరు కలిసి చేసిన సినిమాలకు సపరేట్ అభిమాన వర్గమే ఉందనడంలో సందేహం లేదు. ఆయన జయంతి సెప్టెంబర్ 20వ తేదీ ఉండడంతో శత జయంత్యుత్సవాలు అన్నపూర్ణ స్టూడియోలో బుధవారం జరిగాయి. ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో ఏఎన్నార్ పంచలోహ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా పాల్గొన్నారు.
ఈ వేడుకలలో సినీ ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అల్లు అరవింద్, మురళీమోహన్, బ్రహ్మానందం, మోహన్‌బాబు, సుబ్బిరామిరెడ్డి, జగపతిబాబు, దిల్ రాజు, శ్రీకాంత్, రామ్‌చరణ్, రానా, మహేష్‌బాబు, నమ్రత, విష్ణు, నాని, డీజీపీ అంజనీకుమార్, కీరవాణి, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, రాజమౌళి దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి ఏఎన్నార్ తో తనకు ఉన్న బంధాన్ని గురించి మాట్లాడారు.
‘నాగేశ్వరరావు గారిని చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసి ఆరాధించా. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు పరిచయం తక్కువ. ఒక అవార్డు వేడుకలకు ఇద్దరం వెళ్లాం. ఆ సమయంలో ఇద్దరం ఒకే రూములో ఉన్నాం. ఆ సమయంలో ‘దేవదాసు’ తర్వాత ‘మిస్సమ్మ’లో కమెడియన్ రోల్ ఎందుకు చేశారని ఆయనను అడిగాను’ అని చెప్పారు.
ఆయన కూడా దానికి బదులుగా ‘దేవదాసు చిత్రం నుంచి అన్నీ తాగుబోతు కథలే వస్తున్నాయి. అందుకే అడిగి మరీ కామెడీ రోల్స్ చేశా’అని ఆయన చెప్పారు కూడా. ఆయన అభిమానులు కొడతారని చక్రపాణి గారు చెప్పినా ఏఎన్నార్ పట్టు బట్టారట. ఇమేజ్ మార్చుకోకుంటే తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారట. ఆయనకు ఆయనపై అంత కాన్ఫిడెన్స్ ఉండేది. దీనితో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. నాకు చాలా విషయాల్లో ఆయన ఒక రోల్ మోడల్ అని దర్శక ధీరుడు రాజమౌళి చెప్పారు.