Schools Holidays : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, గిరిజన కుంభమేళా మేడారం జాతర. రెండేళ్లకోసారి తల్లులు వనం వీడి జనంలోకి వచ్చి బిడ్డలను ఆశీర్వదించే తరుణమిది. ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని శ్రీమేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 24వ తేదీ వరకు కొనసాగుతుంది.
జాతరకు సంబంధించి అన్ని విభాగాల అధికారులు కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేశారు. రవాణా పరంగా టీఎస్ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 6వేల స్పెషల్ బస్సులను నడుపుతోంది. జాతరకు వచ్చే భక్తుల కోసం జంపన్న వాగు, పరిసర ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
గిరిజన కుంభమేళా అయిన జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలోని స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. నాలుగు రోజులు సెలవులు ఉంటాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని విద్యాసంస్థలను మూసేయాలని ఆమె డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం కూడా హాలీడే కావడంతో వరుసగా ఐదు రోజులు సెలవులు వచ్చాయి.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించారు. అయితే, ఈ గిరిజన కుంభమేళా జాతరకు జాతీయ హోదా కల్పించాలంటూ ఎంతో కాలంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది.
ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ జాతరకు కోటికి పైగా భక్తులు రానున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.
జాతర నేపథ్యంలో జిల్లాలో ఫిబ్రవరి 21, 22, 23, 24 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు కార్యాలయాలకు కూడా పని చేయవని ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 25 ఆదివారం కూడా సెలవు. తిరిగి పాఠశాలలు, కార్యాలయాలు 26 సోమవారం ప్రారంభమవుతాయని కలెక్టర్ చెప్పారు.