
TDP activists : అన్న ఎన్టీఆర్ పెట్టిన తెలుగు దేశం పార్టీ తెలుగు రాష్ర్టాల రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా నిలిచింది. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ముందుకెళ్తున్నది. అయితే రాజమహేంద్రవరంలోని గోదావరి తీరాన రేపటినుంచి తెలుగుదేశం మహాపండుగ నిర్వహణకు సిద్ధమైంది. ఇక్కడే మూడు రోజుల పాటు మహానాడు నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసింది. సుమారు 15 లక్షల మంది పార్టీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నది.
గోదావరి తీరమే ఎందుకు..?
ఏపీలో అధికార పీఠం ఎక్కాలంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలే కీలకం. అందుకే ఇక్కడే మహానాడు ను ఈసారి టీడీపీ ఏర్పాటు చేసింది. ఈనెల 27న పార్టీ ప్రతినిధుల సభ, 28న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ ఈ సభా ప్రాంగణంలోనే మూడు రోజుల పాటు బస్సులో బస చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రెండు తెలుగు రాష్ర్టాల నుంచి సుమారు 15 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే చంద్రబాబు సంతకాలతో కూడిన ఆహ్వాన పత్రికలు ప్రతినిధులకు అందాయి.
ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల వేళ జరుగుతున్న ఈ మహానాడు కు ప్రాధాన్యత నెలకొంది. పార్టీకి పూర్వవైభవం, వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని జగన్ ధీమాగా ఉన్నారు. ఈ సందర్భంలో జగన్ కు కౌంటర్ గా చంద్రబాబు ఏం మాట్లాడుతారు… ఏం ప్రకటిస్తారోనని అంతా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పొత్తులతోనే వెళ్తామని ప్రకటించిన నేపథ్యంలో మరి ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారోనని కూడా అంతా వేచి చూస్తున్నారు.