
Vijayasai Reddy Comments : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇది అక్రమ అరెస్టు అంటూ టీడీపీ ఆందోళనలు చేపట్టింది. ఈ ఆందోళనలకు దేశ, విదేశాల్లో ఎంతో మంది నుంచి సంఘీభావం వచ్చింది. ఇది కేవలం ఏపీ ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణితోనే తమ అధినేత అరెస్టయ్యారంటూ టీడీపీ ఆరోపిస్తున్నది. లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేశ్ ఈ అంశాన్ని వివరిస్తూ ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ విషయమై మాట్లాడారు.
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడిని దూషించడం వివాదాస్పదమైంది. సహచర ఎంపీ అనే కనీస గౌరవం ఇవ్వకుండా లోక్ సభలోనే మాట్లాడడం , మిగతా ఎంపీలను ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇక మరోవైపు రాజ్యసభలో విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబుపై కేసుల విషయంలో మాట్లాడారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో టీడీపీ అధినేత పాత్ర ఉందని, ఇందులో ప్రభుత్వ పాత్ర లేదని చెప్పుకొచ్చారు.
రాజ్యసభలో చంద్రబాబు అవినీతి పైన వైసీపీ నేత సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి, కుంభకోణాలు, వెన్నుపోట్లకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా 14 ఏండ్ల చంద్రబాబు పాలన కారణంగానే ఏపీ వెనుకబడిపోయిందన్నారు. తనపై తొమ్మది క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో చెప్పారని, ఇదే ఆయన క్రిమినల్ నేపథ్యాన్ని అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఇక వెన్నుపోటుదారుడంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. దీనిపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. 9 క్రిమినల్ కేసులు కక్ష సాధింపు వల్లే నమోదయ్యాయని, మరి జగన్ పై ఎన్ని కేసులు ఉన్నాయో కూడా రాజ్యసభలో ప్రస్తావించాల్సి ఉండేదని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ లా కరుడుగట్టిన ఆర్థిక నేరగాడు కాదని చెప్పుకొచ్చారు. ఇక విజయసాయి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.