
Revanth Reddy : కర్ణాటక ఫలితాలు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో తెలంగాణ కూడా ఉంటుందని వచ్చే ఎన్నికల్లో తామే ప్రభుత్వంలోకి వస్తామని ఆయన జోస్యం చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయంపై ఆయన శనివారం (మే 13) రోజున ప్రెస్ మీట్ పెట్టారు. ఆయనతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే ఉన్నారు. రేవంత్ మాట్లాడుతూ కర్ణాటక ప్రజల తీర్పు దేశప్రజల తీర్పు అని అన్నారు. ఇక రానున్న అన్ని రాష్ట్రాలు, దేశంలో కూడా తమ ప్రభుత్వమే వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవాలని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు చేసిన కుట్రలను అక్కడి ప్రజలు తిప్పికొడ్డారని అన్నారు. జేడీఎస్ కు భారీ సీట్లు కట్టబెట్టి హంగ్ వచ్చేలా చేస్తే తర్వాత జేడీఎస్ బీజేపీకి మద్దతిచ్చి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా కేసీఆర్ కుట్రలు పన్నాడని అన్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామిని కర్ణాటకకు సీఎం చేయాలని కేసీఆర్ ప్రకటించడంలోనే ఆయన ఏ పార్టీకి మేలు చేస్తున్నారో అర్థమవుతుందన్నారు.
కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవాలని ప్రధాని, తెలంగాణ సీఎం కేసీఆర్ కేసీఆర్ కుట్రలను కర్ణాటక ప్రజలు విస్పష్టంగా తిరస్కరించినట్లు చెప్పారు. తెలంగాణ కర్ణాటక బార్డర్ లో కూడా కాంగ్రెస్ భారీ సీట్లు దక్కించుకుందన్నారు. తెలంగాణతో బార్డర్ షేర్ చేసుకున్న కన్నడిగులపై ఎక్కువగా తెలంగాణ ప్రభావం ఉంటుంది. అలాంటి చోట్లనే భారీ మెజారిటీ సాధించడం చూస్తుంటే తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ ను కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుందన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదటి విజయం హిమాచల్ ప్రదేశ్, రెండో విజయం కర్ణాటక, ఇక మూడోది తెలంగాణ, 2014లో దేశ వ్యాప్తం కానున్నదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ నాయకులు, కేడర్ కలిసి పనిచేయడం మూలంగానే ఇంతటి భారీ విజయం కైవసం అయ్యిందన్నారు. అహంకారం (ప్రధాని), అవినీతి సొమ్ము (కేసీఆర్)తో అక్కడి ప్రజలను మభ్యపెట్టాలని చూసినా వారు మంచి నిర్ణయం తీసుకున్నారని వారికి తన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోనూ ఈ విధంగానే బీఆర్ఎస్ ను మరోసారి గద్దెపై కూర్చోబెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతుందని, ఇద్దరు ఒకే చెట్టు కాయలని ఆయన విమర్శించారు.