
Sharmila and KA Paul : రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో పొత్తుల ఎత్తులు కొత్త పుంతలు తొక్కనున్నాయి. ఈ మేరకు కొన్ని పార్టీలు ఓ కూటమిగా ఏర్పడనున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ దేశంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుండటంతో రాష్ట్రంలో పొత్తులు కలవనున్నాయి. రాష్ట్రమే వేదికగా మారనుంది. ఈ మేరకు చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు నువ్వా నేనా అనే రీతిలో పోటీకి దిగనున్నాయి. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ, బీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా మాకే ఉందని కాంగ్రెస్ చెబుతోంది. కర్ణాటక ఫలితాలతో తెలంగాణలో కూడా పాగా వేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది.
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల, ప్రజాక్రాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, తీన్మార్ మల్లన్న మధ్య చర్చలు సాగుతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడితే షర్మిల సీఎం, కేఏ పాల్ హోం మంత్రి, రెవెన్యూ మంత్రి తీన్మార్ మల్లన్న ఉండాలని ఒప్పందం చేసుకుంటున్నారని సమాచారం. ఇలా రాష్ట్రంలో ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఎవరి ఊహల్లో వారు విహరిస్తున్నారు.
ఇలా తెలంగాణలో రాజకీయ సమీకరణలు కొత్త పంథా తొక్కుతున్నాయి. రాజకీయాల్లో ఇలాంటి మార్పులు వస్తుండటంతో భవిష్యత్ లో ఇంకా ఏం పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అటు బీజేపీ, కాంగ్రెస్, బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా తమ ప్రభావం చూపించాలని శతవిధాల ప్రయత్నిస్తున్నాయి.