Tirupati:
తిరుమలలో భక్తుల ప్రాణాలకు రక్షణ కొరవడినట్లు కనిపిస్తున్నది. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. దేవదేవుడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి చేరుకుంటారు. కొందరు వాహనాల్లో, మరికొందరు కాలినడకన మెట్ల మార్గంలో వస్తుంటారు. అయితే కొంత కాలంగా ఈ మెట్ల మార్గంలో వచ్చే భక్తుల భద్రతను ఏపీ ప్రభుత్వం, టీటీడీ గాలికొదిలేసినట్లు విమర్శలు వస్తున్నాయి. కనీసం రక్షణ చర్యలు కానరావడం లేదని భక్తులు మండిపడుతున్నారు. మౌళిక వసతుల కల్పనలోనూ ప్రస్తుత జగన్ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. తెలుగు రాష్ర్టాల భక్తుల తిరుమలలో పరిస్థితిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.
అయితే తాజాగా ఆరేళ్ల చిన్నారి చిరుత పులిదాడిలో మరణించడం సంచలనంగా మారింది. అలిపిరి కాలినడక మార్గంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ ఘటన జరిగింది. చిన్నారి లక్షిత సహా కుటుంబ సభ్యులు రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహ స్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఇంకో గంటలో తిరుమలకు చేరుకోవాల్సి ఉంది. ఒక్క సారి గా చిరుత లక్షిత పై దాడి చేసి, అడవిలో కి లాక్కెళ్లింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే రాత్రి కావడంతో గాలింపు చర్యలు ఫలించలేదు. ఉదయం అడవిలోనే సగం తినేసిన లక్షిత మృతదేహం దొరికింది. అయితే గతంలోనూ బాలుడిపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది.
తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, చిరుత పులుల సంచారం పెరిగిందని తెలిసినా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో టీటీడీ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీటీడీ పాలకమండలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కాలినడక మార్గంలో పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టాలని భక్త జనం కోరుతున్నది. చిన్నారి లక్షిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తుున్నది. అలిపిరి నుంచి కాలినడక మార్గంలో చిరుత పులుల సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భద్రతా చర్యలు విస్తృతం చేయాలనే అభిప్రాయం వినిపిస్తున్నది.