
KCR Dream : హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా దళిత బంధు తెచ్చిన కేసీఆర్ ఆ తర్వాత గిరిజన బంధు అంటూ ప్రకటించారు. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ‘బీసీ బంధు‘కు ప్రణాళికలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. దళిత బంధు వచ్చిన సమయంలో బీసీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే బీసీల కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు కేసీఆర్. దీనిపై విస్తృతంగా కసరత్తు చేసి ఒక పథకానికి శ్రీకారం చూట్టారు ఆయన. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలనుఆర్థికంగా బలోపేతం చేయాలని అందుకు రూ. లక్ష ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు.
పథకం అమలు విధి, విధానాలపై మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని సబ్ కమిటీలు విశ్వబ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, మేదరి, కుమ్మరి తదితర వృత్తి కులాల వారికి ప్రోత్సాహకాలు అందించేలా విధివిధానాలు ఖరారు చేస్తుంది. ఈ సబ్ కమిటీ విధివిధానాలు దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా అమలు చేయాలని సీఎం నిర్ణయించినట్లు లీకులు వినిపిస్తున్నాయి. జూన్ 2 నుంచి నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 21 రోజుల పాటు సాకే ఈ ఉత్సవాల్లో రూ. 2వందల కోట్ల వరకూ కేటాయించాలని అనుకుంటున్నారు. సచివాలంలో మొదటి రోజు వేడుకలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాష్ట్రం మొత్తం ఆయా కేంద్రాల పరిధుల్లో కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ ఉత్సవాల్లోనే రూ. లక్ష సాయంపై గులాబీ బాస్ అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.
దళిత బంధు సమయంలో దళితులకు ఎలాంటి అర్హత పెట్టలేదు. ప్రతీ దళితుడికి ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ చాలా మంది దళితులకు ఇచ్చారు. కానీ బీసీ బంధు అలాకాదు. దానికి అర్హతలు ఉండాలని నిర్ణయించారట. అరకొరగా ఇస్తే అసంతృప్తి ఎక్కువవుతుంది. దళితులకు రూ. 10 లక్షలు ఇచ్చి, బీసీలకు లక్షేనా అంటూ వాదనాలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నింటినీ ఎదుర్కొని బీసీ బంధును అమలు చేస్తామని కేసీఆర్ బలంగా చెప్తున్నట్లు వినిపిస్తుంది.