YCP Mangalagiri Candidate : రెండో సారి గెలవడానికి వైసీపీ నానా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సగానికి పైగా సీట్ల అభ్యర్థులను ప్రకటించినా ఆ పార్టీ కొన్ని చోట్ల మళ్లీ అభ్యర్థులను మార్చుతోంది. నిన్న 9వ జాబితాను ప్రకటించిన జగన్.. మంగళగిరి నియోజకవర్గ ఇన్ చార్జిని మళ్లీ మార్చేశారు. ఈ నియోజకవర్గంలో నారా లోకేశ్ టీడీపీ తరుపున బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. ఆయనపై బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలనే యోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో నారా లోకేశ్ ఓడిపోయినా నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ. . క్యాడర్ ను పటిష్టపరుచుకున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రజల సమస్యలపై పోరాడుతూ..నిత్యం అధికార పార్టీని ఎండుగడుతూనే ఉన్నారు. అంతేగాక టీడీపీకి వారసుడనే ట్యాగ్, గత ఎన్నికల్లో ఓడిపోయాడనే సానుభూతి, అధికారంలోకి వస్తే కీలక పదవి దక్కే అవకాశం ఉండడంతో.. నియోజకవర్గ ప్రజలు లోకేశ్ వైపే చూస్తున్నారని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. లోకేశ్ ను ఎదుర్కొవడానికి వైసీపీ అధిష్ఠానం రెండు సార్లు ఇన్ చార్జులను మార్చడం గమనార్హం.
2019లో లోకేశ్ పై వైసీపీ నుంచి గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని మారుస్తూ బీసీ నేతగా ఉన్న గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్ చార్జిగా నియమించింది. ఆయన నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సడెన్ గా ఆయనకు షాక్ ఇస్తూ మరోసారి నియోజకవర్గ ఇన్ చార్జిని మార్చేసింది వైసీపీ అధిష్ఠానం. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు మురుగుడు లావణ్య పేరును ప్రకటించింది. నిన్న మంగళగిరి వైసీపీ నేతలైన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గంజి చిరంజీవి, కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో సీఎం ఆఫీస్ లో చర్చలు జరిపారు. అనంతరం వైసీపీ అధిష్ఠానం లావణ్య పేరును ప్రకటించింది. తొలి జాబితాలో గంజి చిరంజీవిని 9వ జాబితాకు వచ్చేసరికి లావణ్యకు అవకాశం ఇచ్చింది.
మంగళగిరిలో పలు సర్వేలు చేసిన వైసీపీ అధిష్ఠానం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈక్రమంలో గంజి చిరంజీవిని తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన (చేనేత, బీసీ) లావణ్యను బరిలోకి దించుతోంది. ఈమె మాజీ ఎమ్మెల్యే కమల కుమార్తె మాత్రమే కాదు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు కూడా.