ఏప్రిల్ – మే నెలలో కర్ణాటకలో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. దాంతో అటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డి పోరాడాలని చూస్తున్నాయి. ఇక సందట్లో సడేమియా లాగా కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే మేమే కీలకంగా మారుతాం కాబట్టి ముఖ్యమంత్రి పదవి లేదంటే కీలకమైన మంత్రి పదవులను పొందొచ్చు అని చూస్తున్నారు.
తాజాగా సౌత్ ఫస్ట్ వెబ్ సైట్ కోసం పీపుల్స్ పల్స్ సంస్థ సిస్రో సంస్థతో కలిసి సర్వే నిర్వహించింది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా మరో నాలుగు నెలల్లో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మెజారిటీ రాదని, కాకపోతే 100 స్థానాలకు పైగా సాధించి కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో నిలుస్తుందని , 90 స్థానాలతో భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందని తేల్చారు. ఇక కుమారస్వామి పార్టీకి 15 నుండి 30 స్థానాల మధ్య గెలుచుకుంటుందని ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే కుమారస్వామి కీలకం కానున్నాడని చెబుతోంది సర్వే. అయితే సర్వే ఫలితాలు ఇలా ఉండగా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మాత్రం అధికారం మాదంటే మాది అంటూ పీపుల్స్ పల్స్ సర్వేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.