ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ ( పీకే ) కు మొదటి రోజునే బీహార్ ప్రజలు పెద్ద షాక్ ఇచ్చారు. ప్రజల కోసం , మార్పు కోసం వస్తున్నా అంటూ ”జన్ సురాజ్ ” అనే పేరుతో పాదయాత్ర మొదలుపెట్టారు పీకే. ఇన్నాళ్లు తెరవెనుక ఉండి మంత్రాంగం నడిపించిన పీకే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తహతహలాడుతున్నారు.
నితీష్ కుమార్ కు అండగా గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నారు పీకే. జేడీయు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పీకే ను ఆ పార్టీ నుండి తొలగించారు. దాంతో ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగాలని గట్టి ప్రయత్నాలే చేసారు. కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వెళ్లారు కానీ కండీషన్స్ తేడా రావడంతో ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ముందుగా స్వరాష్ట్రమైన బీహార్ లో ప్రజల నాడీ తెలుసుకోవాలని భావించి 3500 కిలోమీటర్ల పాదయాత్ర ప్లాన్ చేసారు.
అయితే గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 న ఈ కార్యక్రమం ప్రారంభించగా భారీ ఎత్తున బహిరంగ సభకు ప్రజలు వస్తారని భావించగా బహిరంగ సభ వెలవెలబోయింది. దాంతో ఖంగుతిన్నారు పీకే. పశ్చిమ చంపారన్ జిల్లా బేతియాలో నిర్వహించిన సభ కు జనాలు రాకపోవడంతో ప్రశాంత్ కిషోర్ పని అయిపోయినట్లే అని భావిస్తున్నారు. రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదు …… అంటూ దెప్పి పొడుస్తున్నారు.