నటీనటులు : ప్రియదర్శి , కావ్య కళ్యాణ్ రామ్ , వేణు
సంగీతం : భీమ్స్
నిర్మాతలు : హర్షిత్ రెడ్డి – హన్షిత
దర్శకత్వం : వేణు ఎల్దండి
విడుదల తేదీ : 3 మార్చి 2023
రేటింగ్ : 3/5
కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన టిల్లు వేణు దర్శకత్వం వహించిన చిత్రం ” బలగం ”. అగ్ర నిర్మాత దిల్ రాజు వారసులు హర్షిత్ రెడ్డి – హన్షిత సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది ప్రీమియర్ షోల ద్వారా. మరి ప్రేక్షకులను కూడా అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ :
మనవడు సాయిలు ( ప్రియదర్శి ) కి పెళ్లి చేయాలనుకుంటాడు తాత కొమురయ్య ( సుధాకర్ రెడ్డి ). అయితే రెండు రోజుల్లో ఎంగేజ్ మెంట్ అని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కొమురయ్య చనిపోతాడు. తనకు పెళ్లి అయితే కట్నంగా వచ్చే డబ్బుతో తన అప్పులను తీర్చొచ్చు అని ఆశపడుతున్న సాయిలుకు తాత మరణంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఇదే సమయంలో చావు ఇంట్లో గొడవలు జరగడంతో ఆ పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అవుతుంది.
ఇలాంటి సమయంలోనే తన మరదలు అయిన సంధ్య ( కావ్య కళ్యాణ్ రామ్ ) కంటపడుతుంది. సంధ్య నాన్నకు బాగా ఆస్థి ఉండటంతో ఎలాగైనా సరే ఆమెను ప్రేమలోకి దించాలని , పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు సాయిలు. మరి సాయిలు ప్లాన్ వర్కౌట్ అయ్యిందా ? కొమురయ్య కుటుంబంలో ఉన్న విబేధాలు సమసిపోయాయా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
హైలెట్స్ :
ప్రియదర్శి
కావ్య
ఎమోషన్స్
ఎంటర్ టైన్ మెంట్
డ్రా బ్యాక్స్ :
స్లో నరేషన్
నటీనటుల ప్రతిభ :
ప్రియదర్శి నటించాడు అనే కంటే జీవించాడు అనే చెప్పాలి. సాయిలు పాత్ర కనిపించిందే తప్ప ప్రియదర్శి ఎక్కడా కనిపించలేదు. ఆ పాత్రకు ప్రాణం పోసాడు ప్రియదర్శి. అలాగే కావ్య కళ్యాణ్ రామ్ కూడా చక్కగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. సుధాకర్ రెడ్డి పాత్ర నిడివి తక్కువే అయినప్పటికి సినిమా అంతా అతడి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. వేణు , జయలక్ష్మీ , జయరాం , రూప లక్ష్మీ ,మురళీధర్ గౌడ్ తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు.
సాంకేతిక వర్గం :
ముఖ్యంగా ఇలాంటి కథను ఎంచుకొని సినిమాగా నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాతలను తప్పకుండా అభినందించాలి. మొదటి ప్రయత్నంలోనే మంచి ఫలితం సాధించారు…… అలాగే తమ గట్స్ ఏంటో చూపించారు. ఇక వేణు కెమెడియన్ గా సుపరిచితుడే. ఇలాంటి కథను తీసుకొని సినిమాగా మలచడం అంటే గొప్ప ప్రయత్నం అనే చెప్పాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న భావోద్వేగాలను చక్కగా చూపించాడు. ఇది సినిమాగా కాకుండా తమ జీవితాలే కదా ! అని ఫీలయ్యేలా చేయగలిగాడు. వేణు నూటికి నూరు శాతం దర్శకుడిగా , కథకుడిగా తన ప్రతిభ ప్రదర్శించాడు. భీమ్స్ అందించిన పాటలు , నేపథ్య సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. పల్లె అందాలు మరింత అందంగా తెరమీద కనిపించాయి.
ఓవరాల్ గా :
తప్పకుండా చూడాల్సిన సినిమా బలగం.