అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అదిరిపోయే మాస్టర్ ప్లాన్ వేసింది. తాజాగా ఈ సంస్థ శిఖరాగ్ర కథానాయకులు చిరంజీవి , బాలకృష్ణ లతో ఏకకాలంలో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవితో వాల్తేరు వీరయ్య , బాలయ్య తో వీర సింహా రెడ్డి చిత్రాలను నిర్మిస్తోంది. అయితే ఈ రెండు చిత్రాలను కూడా 2023 జనవరిలో సంక్రాంతి కానుకగా జనవరి 12 న బాలయ్య వీర సింహా రెడ్డి చిత్రాన్ని అలాగే జనవరి 13 న చిరు వాల్తేరు వీరయ్య ను విడుదల చేస్తున్నారు. ఒక్క రోజు తేడాతో ఇద్దరు శిఖరాగ్ర కథానాయకుల చిత్రాలను విడుదల చేస్తోంది.
సాధారణంగా సినిమా విడుదల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లను నిర్వహించడం , దానికి ఒకరిద్దరిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం చేస్తుంటారు. ఇద్దరు స్టార్ హీరోలు అందునా ఒకరోజు తేడాలో రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతుండటంతో మైత్రి మూవీ మేకర్స్ భారీ ఆలోచన చేసింది. బాలయ్య వీర సింహా రెడ్డి వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి ని అలాగే చిరు వాల్తేరు వీరయ్య వేడుకకు బాలయ్య ను ముఖ్య అతిథిగా పిలిస్తే తప్పకుండా సంచలనం అవుతుందని, అలాగే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన వాళ్ళం అవుతామని భావిస్తున్నారట. ఇక చిరు , బాలయ్య ఇద్దరు కూడా ఊర మాస్ హీరోలు కావడం , ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోలు కావడంతో ఈ ప్రయోగం చేస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యారట. ఇదే విషయాన్ని అటు బాలయ్య కు ఇటు చిరంజీవి కి కూడా చెప్పారట.
ఈ కుండ మార్పిడి లాంటి పద్ధతి బాలయ్య కు చిరంజీవి కి కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే నందమూరి – మెగా అభిమానులకు మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులకు కూడా శుభ సూచకం అనే చెప్పాలి. అభిమానులు పోటీకి పోయి మనస్పర్థలు పెంచుకుంటారు కానీ హీరోలు మాత్రం ఎప్పుడూ ఒక్కటే అని నిరూపించినట్లు అవుతుంది. అలాగే స్టార్ హీరోల అభిమానుల మధ్య సఖ్యత నెలకొంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకే వేదికపై బాలయ్య , చిరంజీవి కలిసి ఫోటోలకు ఫోజిస్తే …… మనమంతా ఒక్కటే అనే సంకేతం ఇస్తే…… అభిమానులు పులకించిపోవడం ఖాయం. బాక్సాఫీస్ వద్ద కొదమ సింహల్లా గర్జిస్తాం కానీ బయట మిత్రులమే అనే సంకేతం ఇచ్చినట్లు అవుతుంది. మొత్తానికి ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం.