
ఈ సంక్రాంతికి కనీవినీ ఎరుగని రీతిలో పోటీ నెలకొంది. ఎందుకంటే తెలుగునాట అలాగే తమిళనాట కూడా స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. తెలుగు విషయానికి వస్తే…… గత 40 ఏళ్లుగా మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. ఇద్దరు కూడా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టే కొదమ సింహాలు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. బాలయ్య ఈనెల 12 న వీర సింహా రెడ్డి చిత్రంతో వస్తుండగా చిరంజీవి ఈనెల 13 న వాల్తేరు వీరయ్య చిత్రంతో వస్తున్నాడు. దాంతో అటు చిరంజీవి అభిమానులు ఇటు బాలయ్య అభిమానులు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే రికార్డులను కట్టబెట్టాలని కసిగా ఉన్నారు.
ఇక తమిళనాడు విషయానికి వస్తే…….. తమిళనాట విజయ్ , అజిత్ ఇద్దరు కూడా తిరుగులేని మాస్ హీరోలు. రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్ డం ఉన్న హీరోలు…… సమ కాలీకులు కావడం విశేషం. ఇక ఇద్దరు కూడా బాక్సాఫీస్ వద్ద నువ్వా – నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు. ఇక తమిళనాట కూడా ఈ ఇద్దరూ ఒకరోజు తేడాతో పోటీకి సిద్ధం అవుతున్నారు. అజిత్ నటించిన తునివు జనవరి 11 న విడుదల అవుతుండగా విజయ్ నటించిన వారిసు జనవరి 12 న విడుదల అవుతోంది. దాంతో అక్కడ కూడా ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య అప్పుడే యుద్ధం మొదలైంది. మా సినిమా పెద్ద హిట్ అవుతుందంటే …… లేదు లేదు మాదే పెద్ద హిట్ అవుతుందంటూ సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి. కానీ తెలుగులో ఈ ఇద్దరు హీరోలకు పెద్దగా మార్కెట్ లేదు కాబట్టి పండగ రోజులను క్యాష్ చేసుకోవడం మినహా పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. అసలు సిసలైన పోటీ మాత్రం బాలయ్య – చిరంజీవి ల మధ్యే ఉండబోతోంది.
అయితే జనవరి 11 న అజిత్ తెగింపు , జనవరి 12 న బాలయ్య వీర సింహా రెడ్డి , విజయ్ వారసుడు , జనవరి 13 న చిరంజీవి వాల్తేరు వీరయ్య ఇలా మూడు రోజుల్లో నాలుగు చిత్రాలు విడుదల అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద సింహనాదం చేయనున్నాయి. అయితే సంక్రాంతి మొనగాడు ఎవరు ? అత్యధిక వసూళ్లు సాధించే హీరో ఎవరు ? అన్నది తెలియాలంటే సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సిందే.