
AP CID Notices : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్టు చేస్తారనే వదంతుల నేపథ్యంలో సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్లి నోటీసులు అందజేశారు. ఈమేరకు టీడీపీ నేత గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్న లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నమోదు చేశారు. ఐఆర్ఆర్ కేసులో అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని సూచించారు.
41 ఏ కింద సీఐడీ అధికారులు లోకేష్ కు నోటీసులు జారీ చేయడం గమనార్హం. దీంతో అక్టోబర్ 4న ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు కూడా ఇలాగే నోటీసులు అందజేశారు. ఇప్పుడు లోకేష్ కు కూడా నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యమేమిటనే ఆలోచనలు అందరిలో వస్తున్నాయి. ఈనేపథ్యంలో లోకేష్ విషయంలో సీఐడీ అధికారులు ఏ సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారో తెలియడం లేదు.
లోకేష్ అరెస్టయితే పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై టీడీపీ వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి. వైసీపీ కుతంత్రాలను అడ్డుకోవాలని చూస్తున్నారు. దీనిపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం కావాలనే అడ్డంకులు కల్పిస్తోందని మండిపడుతోంది. నోటీసులు జారీ చేయడంలో అధికార పార్టీ పాలసీ ఏంటనేది తెలియడం లేదు.
ఈ క్రమంలో ఏపీలో ప్రజాస్వామ్యం మనుగడలో లేదనిపిస్తోంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు. అవినీతికి కొమ్ము కాయొచ్చు. అడ్డదారుల్లో ప్రతిపక్షాలను దెబ్బ కొట్టొచ్చు. పోలీసులతో లేనిపోని కేసులు పెట్టించొచ్చు. అచ్చం సినిమాల్లో లాగా ఏపీలో పాలన సాగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా ఏం దుర్మార్గాలు చేస్తారో తెలియడం లేదు.