
CM own district : ఏపీ సీఎం జగన్ ముందు నుంచి అమరావతికి వ్యతిరేకంగానే ఉన్నారు. టీడీపీ హయాంలో తీసుకున్న ఈ రాజధాని నిర్ణయాన్ని పక్కన పెట్టేసి, మూడు రాజధానులు అంటూ ఆయన ముందుకెళ్లారు. న్యాయస్థానాల్లో ఇబ్బందులు ఎదురైనా, నాడు రాజధానికి భూములిచ్చిన రైతులు వ్యతిరేకించినా ఇప్పటివరకు రాజధానిపై తేల్చకుండా ముందుకు సాగుతున్నారు. అమరావతి శాసన రాజధాని, విశాఖకు పరిపాలన రాజధాని అంటూ ఆయన ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురిచేస్తున్నది. కొత్త నగర నిర్మాణంపై ఆయన తీసుకున్న నిర్ణయం విమర్శలకు కారణమవుతున్నది.
15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం అమరావతిలో అన్ని వనరులు, అవకాశాలు ఉన్నా, మరో కొత్త పేర్లు ప్రకటిస్తూ ప్రతిపాదనలు పంపింది. సీఎం సొంత జిల్లా అయిన కడపలోని కొప్పర్తి పేరును తెరపైకి తెచ్చింది. శాసన రాజధానిగా అమరావతికి తొలి ప్రాధాన్యమివ్వాల్సిన సర్కారు కొప్పర్తి పేరు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
కేంద్రం నిర్మించాలనుకున్న ఈ కొత్త నగరానికి రూ. 1000 కోట్ల మేర కేంద్రం నిధులు కేటాయిస్తుంద. ఏటా 250 కోట్లు ఇస్తుంది. అయితే అమరావతి అభివృద్ధి చేయాలనుకుంటే కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోవచ్చు నాలుగేళ్లుగా అమరావతిని పక్కన పెట్టిన రాష్ట్రం ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ప్రస్తుతం ఆర్థిక సంఘం ప్రతిపాదనలతో వారు అమరావతిని అత్యద్భుతంగా తీర్చిదిద్దవచ్చు. అమరావతిని అభివృద్ధి చేస్తే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు దీటుగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు వనరులు పుష్కలంగా ఉన్నాయని ప్రణాళికే ముఖ్యమని చెబుతూ వచ్చారు.
కానీ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా అమరావతిపై కక్షపూరితంగా ముందుకెళుతున్నదని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి అయినా ఈ నగరం నిర్మాణానికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.