- సొంత పార్టీ నేతలపైనే అసత్య ప్రచారం వెలుగులోకి..

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి కలకలం రేగింది. ఇటీవల తరచూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా మరోసారి అవి బట్టబయలయ్యాయి. పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సోదాలు నిర్వహించారు..
అసలేం జరిగిందంటే..
తమ పార్టీల నేతలే తనపై విష ప్రచారం చేయిస్తున్నారని కొంత కాలంగా ఉత్తమ్ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ అంశమై కొంత కాలంగా పార్టీ సీనియర్లు, మరికొందరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైనే సీనియర్లు విమర్శలకు దిగిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ్ పది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దుష్ర్పచారం చేస్తున్నాని అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఒక నంబర్ను పోలీసులకు అప్పగించారు అయితే ఆరా తీసిన పోలీసులు నంబర్ ను ట్రేస్ చేశారు. ః
యూత్ కాంగ్రెస్ ఆఫీస్ లో తాజాగా సోదాలు..
హైదరాబాద్ లోని యూత్ కాంగ్రెస్ ఆఫీస్ లో సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో హార్డ్ డిస్క్ లను సీజ్ చేశారు. పలు పరికరాలను తీసుకెళ్లారు. గతంలోనూ కాంగ్రెస్ ఆఫీస్ లో ఉన్న సోషల్ మీడియా వింగ్, సునీల్ కొనుగోలు టీంపై పోలీసులు దాడి చేశారు. ఉత్తమ్ ఫిర్యాదు చేసిన నంబర్ యూత్ కాంగ్రెస్ ఆఫీస్ నుంచే పని చేస్తున్నదని పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం. అయితే తనతో పాటు జగ్గారెడ్డి, కోమటి రెడ్డి తదితర నేతలపై కొంత కాలంగా ఈ విష ప్రచారం జరుగుతున్నదని కొంత కాలంగా ఉత్తమ్ చెబుతున్నారు.
గతంలో నూ తనపై పార్టీ నేతలే దుష్ర్పచారం చేయిస్తున్నారని ఒక అధికారి చెప్పినట్లు ఉత్తమ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజా యూత్ కాంగ్రెస్ ఆఫీస్ పై దాడి ఉత్తమ్ ఫిర్యాదు వల్లేనని టాక్ నడుస్తున్నది. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ లో ఈ లొల్లి తగ్గేలా లేదు. సీనియర్లు, కొత్త గా చేరిన వారి మధ్య సయోధ్య కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ని ప్రకటించిన నాటి నుంచి సీనియర్లు కొంత అసంతృప్తి తో ఉన్నారు. అయితే ఇటీవల తామంతా కలిసే ఉన్నామని కోమటి రెడ్డి చెప్పినా తాజా వివాదంతో మళ్లీ మొదటికొచ్చినట్లుగా కనిపిస్తున్నది. ఐక్యంగా ఉండి పార్టీ గెలుపునకు కృషి చేయాల్సిన అగ్రనేతలు ఇలా వివాదాలకు తావివ్వడం కార్యకర్తల్లో నిరాశ మిగులుస్తు్న్నది. రానున్న రోజుల్లో ఇది మరింత ముదిరితే పార్టీకి చేటు చేస్తుందని అంతా భావిస్తున్నారు.
రేవంత్ పై కూడా విమర్శలు..
పార్టీ సీనియర్లు పీసీసీ చీఫ్ పై కూడా తరచూ విమర్శలు చేస్తున్నారు. బయట నుంచి వచ్చిన వారికి పీసీసీ చీఫ్ ఇచ్చారని కొందరు బాహాటంగానే మండిపడ్డారు కూడా. అయితే రేవంత్ మాత్రం తన ధోరణిలో కాకుండా కొంత సంయమనంతో ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తున్నది. తనపై ఎదురు దాడి జరుగుతున్నా ఆయన తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. బీఆర్ఎస్ కు దీటుగా రానున్న ఎన్నికల్లో నిలవడం, పార్టీని అధికారానికి దగ్గర చేయడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసినా కొందరి తీరు కారణంగా పార్టీ పరిస్థతి ఇబ్బంది కరంగా మారుతున్నదని కిందిస్థాయి శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. సమష్టిగా కదిలి కొంత కష్టపడితే రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.