
భార్య-భర్తల బంధం చాలా అన్యోన్యమైంది. కష్టమైనా..సుఖమైనా..ఇద్దరు కలిసి షేర్ చేసుకున్నప్పుడే ఆ దాంపత్య జీవితానికి ఒక అర్థముంటుంది. కానీ,అలాంటి దాంపత్య జీవితానికి అర్థం పర్థం లేకుండా చేశాడో ఓ నీచుడు. నమ్మి వచ్చిన భార్యను,వారిద్దరికి పుట్టిన పిల్లలను కంటకి రెప్పలా చూసుకోవాల్సిన వ్యక్తి భార్య పట్ల కాలయముడయ్యారు. పుట్టింట్లో ఉన్న భార్యను నమ్మించి ఇంటికి తీసుకొచ్చి అత్యంత పాశవికంగా హత్య చేశాడు.
పశ్చిమగోదావరి జిల్లా వీరంపాలెంకు చెందిన గంజి దావీదుకు నిర్మలతో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ ఇద్దరి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు,ఒక అబ్బాయి పుట్టారు. వీరిద్దరు దంపతులు పెళ్లైన తర్వాత అన్యోన్యంగానే ఉన్నారు. అయితే వీరి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో.. కుటుంబాన్ని పోషించుకునేందుకు పిల్లలు,భర్తను ఇక్కడే వదిలేసి నిర్మల కువైట్ వెళ్లారు. ఈ నేపథ్యం లోనే తాగుడుకు బానిసైన దావీద్ తన భార్యను డబ్బుల కోసం వేధించేవాడు.
నిర్మల డబ్బులు పంపించకపోతే పిల్లలను చిత్ర హింసలకు గురి చేసేవాడు. ఇలా ఇటీవల తన కుమార్తెలను చిత్రహింసలు పెడుతుండగా..ఆ వీడియోను తన కుమారుడి చేత రికార్డ్ చేయించి కువైట్‌లో ఉన్న తన భార్యకు పంపించాడు. అయితే ఈ వీడియో కాస్తా స్థానికంగా వైరల్ కావడంతో..స్థానిక పోలీసులు దావీదును అదుపులోకి తీసుకొని జైలుకు పంపారు. తర్వాత కువైట్‌లో ఉంటున్న నిర్మల కూడా పుట్టింటికి వచ్చి వారి అమ్మగారి ఇంట్లోనే ఉంటోంది.
ఈ నేపథ్యంలోనే జైలు నుంచి విడుదలైన దావీద్ నిర్మలను తన ఇంటికి రావాల్సిందిగా కోరారు. అందుకు వారి కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి ఇంటికి తీసుకొచ్చారు. అయితే నిర్మల ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది రోజుల వరకు బాగానే ఉన్న దావీద్ తర్వాత తన అసలు స్వరూపాన్ని ఆమెకు చూపించాడు. దీంతో ఇద్దరు దంపతుల మధ్య గురువారం మళ్లీ గొడవ జరిగింది. అయితే దావీద్ గొడవతో ఆగకుండా శుక్రవారం తెల్లవారు జామున నిర్మల మెడ,చేయి కోసి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో..ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.