150 Feet High Mall : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా దేశంలోనే అత్యంత ఎత్తయిన మాల్‌కు నిలయంగా మారనుంది. రియల్ ఎస్టేట్ సంస్థ ‘సయా’ గ్రూప్, ‘సాయా స్టేటస్’గా పలిచే భారీ సంస్థ భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన మాల్ నిర్మించాలని అనుకుంది. దీనికి వేదికగా ఉత్తర ప్రదేశ్ ను ఎంచుకుంది. ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంది. ఆ రాష్ట్రంలోని నోయిడా – గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే లో సెక్టార్ 129లో ‘సాయా గ్రూప్’ ఈ మాల్ నిర్మిస్తుంది. అయితే నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావాలంటే మాత్రం 2025 వరకు ఆగాల్సిందేనని అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పటికే దీని నిర్మాణం దాదాపు 25 శాతం పూర్తయిందని తెలుస్తోంది.
భారీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ మాల్ 150 అడుగుల ఎత్తుతో, తొమ్మిది అంతస్తులను కలిగి ఉంటుంది. ప్రతీ అంతస్తులో లగ్జరీ బ్రాండ్లు ఉంటాయి. ఆధునిక సౌకర్యాలతో కూడి ఉండే ఈ మాల్ నిర్మాణం కోసం రూ. 2వేల కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సాయా గ్రూప్ తెలిపింది. సింగపూర్‌లోని ప్రసిద్ధ ఆర్కిటెక్చర్ సంస్థ ‘డీపీ ఆర్కిటెక్ట్స్’ ఈ భవన నిర్మాణం నమూనాను రూపొందించింది.
సారా గ్రూప్ 70 శాతం ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకోగా, కేవలం 30 శాతం మాత్రమే పెట్టుబడి దారులకు విక్రయించనుంది. రిటైల్ స్థలాన్ని చదరపు అడుగు రూ.16వేల నుంచి రూ. 40వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. హైపర్ మార్కెట్ గ్రౌండ్ ప్లోర్‌లో ఉంటుంది.
నాలుగో ఫ్లోర్ నుంచి 9వ ఫ్లోర్ వరకు బహుళ స్థాయి పార్కింగ్ తో పాటు బేస్‌మెంట్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. 1600 కార్లు పార్కింగ్ చేసేలా స్థలం ఉంటుంది. నోయిడా, ఢిల్లీలోని కొన్ని టాప్ రెస్టారెంట్లు కూడా ఈ మాల్ కేంద్రంగా తమ కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. పబ్ లు, బార్లు కూడా అందుబాటులో ఉంచనున్నారు.