NRI Ratha Saptami Celebrations: భూమిపై సకల జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నాయంటే అందుకు కారణం సూర్యభగవానుడు. నిత్యం మనకు కనిపించే దేవుడు ఆయనే. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. సూర్య జయంతి రోజైన రథసప్తమి నాడు భక్తులు ఆయనను ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ పర్వదినం మాఘమాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు వస్తుంది. సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణానం ముగించుకుని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తారని భక్తుల విశ్వాసం. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. దీన్నే రథసప్తమి అంటారు. ఈ పర్వదినం ఈ ఏడాది ఫిబ్రవరి 16(శుక్రవారం) వచ్చింది. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు.
కాగా, రథసప్తమి వేడుకలను భారత దేశంలోనే కాదు..హిందువులు ఉన్న ప్రతీ దేశంలోనూ ఘనంగా జరుపుకుంటారు. ఇక అమెరికాలో మన భారతీయులు ఎక్కువగా ఉంటారు కనుక..అక్కడ రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అమెరికాలోని ఎడిసన్ రాష్ట్రంలోని ఒక్ ట్రీలో ఘనంగా నిర్వహిస్తున్నారు. సాయిదత్తా పీఠం, కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో శ్రీ శివవిష్ణు ఆలయంలో రథసప్తమి వేడుకలను అలాగే రాజశ్యామల నవరాత్రి మహోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఈ ఆలయంలో రథసప్తమి వేడుకలను 15వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఉదయం 6గంటలకు ‘కాకడ్ ఆర్తి’, 6.45గంటలకు బాబా అభిషేకం, 7.45గంటలకు గణపతి పూజ, 8.00గంటలకు అరుణ ప్రాసన, 9గంటలకు సూర్యభగవానుడికి అభిషేకం, ఆదిత్య హృదయం పారాయణం, సాయంత్రం 7.30గంటలకు సూర్యభగవానుడికి అర్చన, ఆదిత్య హృదయం పారాయణం నిర్వహించారు. ఈ వేడుకల్లో వేలాది హిందువులు పాల్గొని సూర్య భగవానుడిని దర్శించుకున్నారు.
కాగా, ఇదే ఆలయంలో రాజ శ్యామల నవరాత్రి మహోత్సవాన్ని ఫిబ్రవరి 10 నుంచి నిర్వహిస్తున్నారు. ఈనెల 18వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ప్రతీ రోజు వివిధ పూజ కార్యక్రమాలకు కన్నుల పండువగా నిర్వహిస్తూ వస్తున్నారు.
ఈ నెల 12న ‘వాగ్ వాదిని’ ఉదయం 10గంటలకు పంచముఖ పరమశివుడికి అభిషేక కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 13వ తేదీన ‘నాకులి మాతంగి’, హనుమాన్ చాలీసా పరాయణంతో పాటు హనుమాన్ అభిషేకం చేశారు. 14వ తేదీన ‘కల్యాణ మాతంగి’, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. 15వ తేదీన ‘జగద్రంజని మాతంగి’, దుర్గ సపతసతి పరాయణం చేశారు. 16వ తేదీన ‘సారిక మాతంగి’, కంచి కామకోటి మాతకు అభిషేకం, లలితా మాత, శ్రీచక్రంతో పాటు లలితా సహస్త్రనామ పారాయణం నిర్వహించారు.
ఈ వేడుకల్లో వందలాది భారతీయ భక్తులు పాల్గొనడం విశేషం. అమెరికాలో ఉన్నప్పటికీ మన హిందూ సంస్కృతి, సంప్రదాయాలను వదలిపెట్టకుండా భారత్ లో ఉన్నవారికంటే మెరుగ్గా హిందూ పండుగలను జరుపుకోవడం హర్షణీయం.