KCR : భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల తుంటి ఎముక విరగడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన దూరంగా ఉండటంతో పార్టీ కెప్టెన్ లేని నావగా మారింది. కేటీఆర్, హరీష్ రావు పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సదస్సుల్లో పాల్గొంటున్నా పస రావడం లేదు. ప్రజల్లో ఉత్తేజం పెరగాలంటే బాస్ ఉండాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ వచ్చే నెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ కార్యాలయం ప్రగతి భవన్ కు ఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు. ఆయన రాక సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపాలని పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా భారీ జనసమీకరణ చేసి తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో కేసీఆర్ ప్రజల్లోకి రాక ఘనంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఎర్రవెల్లి ఫాంహౌస్ లో గత నెల 8న తుంటి ఎముక గాయంతో ఆస్పత్రిలో చేరి శస్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం నందినగర్ లోని తన నివాసంలో కోలుకుంటున్నారు. వైద్యుల సూచన మేకు నేతలను తక్కువ సంఖ్యలోనే కలుస్తున్నారు. మరో మూడు నాలుగు వారాలు పూర్తిగా కోలుకుంటారని చెబుతున్నారు. ఈనేపథ్యంలో పార్టీ వ్యవహారాల్లో వేగం పెంచాలని భావిస్తున్నారు.
గజ్వేల్ లో హ్యాట్రిక్ కొట్టిన కేసీఆర్ వచ్చే నెల 20 తరువాత నియోజకవర్గ పర్యటనకు వెళ్లే అవకాశముంది. లోక్ సభకు అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు. కేడర్ తో వరుస భేటీలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో మీటింగులు జరగనున్నాయి. వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. సభ కోసం పలు తేదీలు అనుకుంటున్నారు. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు.