Indian 2 : విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విలక్షణ నటుడు కమల్ హాసన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కమల్ హాసన్ కెరియర్ మరోసారి ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 AD’ లోనూ కమల్ హాసన్ విలన్ గా ఓకే అయ్యారు. ఇప్పటికే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, ప్రభాస్ లు ఉండగా.. కమల్ ఎంట్రీతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ప్రస్తుతం కమల్ హాసన్ ప్రముఖ దర్శకుడు శంకర్ తీస్తున్న ‘ఇండియన్2’లో బిజీగా ఉన్నారు. ఆ సినిమాపై బోలెడు అంచనాలున్నాయి. శంకర్ దర్శకత్వానికి ఫిదా అయిన కమల్ హాసన్ రూ.8 లక్షల విలువైన ఖరీదైన వాచ్ ను అతడికి కానుకగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.
తాజాగా ట్వీట్ చేసిన కమల్ హాసన్ ‘ఇండియన్ 2 లోని కొన్ని సీన్లు చూశాను. శంకర్ దర్శకత్వ ప్రతిభకు ఆశ్చర్యపోయాను. ఇది ఆయన జీవితంలోనే పతాకస్థాయికి నిదర్శనం. ఇది ఖచ్చితంగా శంకర్ ను టాప్ లో నిలబెడుతుందని.. ఆయనను గర్వపడేలా చేస్తుందని చెబుతున్నాను.. ’ అంటూ దర్శకుడు శంకర్ ను పొగిడేశాడు.
ఇక ‘ఇండియన్ 2’ విడుదల కాకముందే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని భారీ ధరకు కొనేసింది. డిజిటల్ రైట్స్ కింద అన్ని భాషల్లో రూ.200 కోట్లకు కొన్నట్టు సమాచారం. ఈ చిత్రం రషెస్ చూసిన నెట్ ఫ్లిక్స్ ఈ భారీ ధరను ఆఫర్ చేసినట్టు సమాచారం.
ఇండియన్ 2 చిత్రం 90 ఏళ్ల సేనాపతి అనే ముసలి వ్యక్తి క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. భారతీయుడు 1 సినిమాకు కంటిన్యూగా సాగుతుంది. ముసలి వేషంలో మేకప్ కోసమే కమల్ హాసన్ 4 గంటలు ఓపికగా వేసుకున్నాడట.. ఈ మేకప్ తీయడానికి 2 గంటల సమయం పడుతుందట.. అంతలా కష్టపడ్డ కమల్ కష్టం తెరపైన చూడాల్సిందే.