
New parliament : ఢిల్లీలో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పార్టీల నేతలకు ఆహ్వానాలు అందాయి. అయితే ఇప్పుడు చర్చంతా పార్లమెంటు ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తున్నారా లేదా అనే అంశంపై సాగుతున్నది. వెళ్తే ఎలా ఉంటుంది.. వెళ్లకపోతే ఎలా ఉంటుందోనని ఆయన తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్రంలోని బీజేపీ పై ఇప్పటికకే ఆయనే యుద్ధం ప్రకటించారు. తెలంగాణకు సహకరించడం లేదని, నిధులు ఇవ్వడం లేదని, దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నదని ఆయన ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ సమయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్వహిస్తున్న ఈ ప్రారంభోత్సవానికి వెళ్తే ఎలాంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయోనని భావిస్తున్నది.
ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. ఈ సమయంలో తాను వెళితే బీజేపీ అనుకూల ముద్ర పడుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఏపీలోని వైసీపీ ప్రభుత్వం బీజేపీకి మద్దతుగా వెళ్తున్నది. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్4ఎస్ హాజరు కావాలా వద్దా అనే అంశంపై సీఎం కేసీఆర్ సన్నిహితులతో, ప్రముఖ నేతలతో చర్చిస్తున్నట్లు తెలిసింది
మరోవైపు ఢిల్లీలో లిక్కర్ స్కాం కేసు జోరు పెరిగింది. కేసీఆర్ కూతురు కవిత పేరును ఇందులో ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ పదేపదే లీక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తే నష్టం చేకూర్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ హాజరైతే ప్రజలు ఎలా భావిస్తారనే అంశంపై కూడా కేసీఆర్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలిసింది. మరి స్వయంగా వెళ్తారా.. లేదంటే పార్టీ నుంచి నేతలను పంపిస్తారా తెలియాల్సి ఉంది. లేదంటే మిగతా పార్టీల్లా తాను కూడా బహిష్కరించి బీజేపీ వ్యతిరేక టీమ్ కు జత కడుతారా చూడాలి. అయితే సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనుక ఏదో మర్మం ఉంటుందని భవిష్యత్ లో ఎదురయ్యే పరిణామాలను అంచనా వేసుకొనే ఆయన ముందుకెళ్తారని టాక్ జోరుగా సాగుతున్నది.