
Farewell to Old Parliament : ఎన్నో కఠిన నిర్ణయాలు, మరెన్నో అర్థవంతమైన చర్చలు, ప్రపంచం ఆశ్యర్యపోయే ప్రకటనలు, అటంకవాది బుల్లెట్ల దెబ్బలను సైతం తట్టుకున్న ఆ భవనం ఇక విశ్రాంతి తీసుకోనుంది. ఆ భవనం అంటే కేవలం గోడలతో ఉన్న నిర్మాణం కాదు దేశ తలరాతను మార్చే గూడు (ఇల్లు). అదే ‘పార్లమెంట్ భవనం’. న్యూ ఢిల్లీలోని సంసద్ మార్గంలో ఉన్న ఈ పార్లమెంట్ భవనం 96 సంవత్సరాలుగా భారతావనికి సేవలను అందించింది. ఎంతో మంది ప్రధానులు, పార్లమెంట్ మెంబర్స్ ను చూసింది. ఇప్పటికీ ఎంతో మంది చరిత్రలో కలిసిపోయినా తను మాత్రం దేశ ఆశయాలను, ఆకాంక్షలను తీరుస్తూనే ఉంది. ఇక అలిసిపోయిన క్షణంలో విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధం అవుతుంది.
ఈ భవనాన్ని 1913 లో బ్రిటిష్ వాస్తు శిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్, సర్ హెర్బర్ట్ బేకర్ ఆధ్వర్యంలో దేశానికి వెన్నెముఖగా నిలిచిన భవనం నిర్మాణం కొనసాగింది. ఫిబ్రవరి, 1921లో హెచ్ఆర్‌హెచ్ ప్రిన్స్ ఆర్థర్, డ్యూక్ ఆఫ్ కన్నాట్, స్ట్రాథెర్న్ ఈ భవన నిర్మాణానికి పునాదిరాయి వేశారు. 1927 లో పార్లమెంట్ భవనం పూర్తయ్యింది. మొత్తం భవనం పూర్తయ్యేందుకు దాదాపు 5 సంవత్సరాలు పట్టింది.
18 జనవరి, 1927న అప్పటి పరిశ్రమలు, కార్మిక శాఖకు బాధ్యత వహించిన గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు సర్ భూపేంద్ర నాథ్ మిత్ర భవనాన్ని ప్రారంభించేందుకు అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌ను ఆహ్వానించారు. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మూడో సెషన్ 19 జనవరి, 1927న ఈ సభలో జరిగింది.
స్వాతంత్ర భారత్ లో 1947 నుంచి 1950 వరకు ఈ భవనంలోనే బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన భారత రాజ్యాంగం రూపొందించబడింది. ఆ తర్వాత 1956 నుంచి ఈ భవనంలో వివిధ నిర్మాణాలు కొనసాగాయి.
దేశ యావత్తు ప్రజలకు పార్లమెంట్ భవనం అంటే కళ్ల ముందు కనిపించేది గుండ్రటి నిర్మాణం, అతి పెద్ద స్తంభాలు ఇక అవన్నీ కనుమరుగు అవనున్నాయి. ఈ రోజు (సెప్టెంబర్ 19) నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని, ఉప రాష్ట్రపతి, స్పీకర్లు, ఎంపీలు పాత పార్లమెంట్ భవనం ఎదుట ఫొటోలు దిగి భావోద్వేకంతో వీడ్కోలు పలికారు.