TDP Leaders : ఏపీలో 2019లో వైసీపీ నేతృత్వంలోని జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నేతలపై దాడులు పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా టీడీపీ నేతల హత్యలు జరిగాయి. జగన్ అధికారంలోకి వస్తే మళ్లీ ఫ్యాక్షనిజం వేళ్లూనుకుంటుందని, ముందు నుంచి రాజకీయ విశ్లేషకులు అనుమానించిందే నిజమైంది. గత నాలుగేళ్ల కాలంలో పదుల సంఖ్యలో టీడీపీ నేతల హత్యకు గురయ్యారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ హత్యలు పెరిగాయి.
కర్నూలు జిల్లాలో ఓ టీడీపీ నేతను కళ్లల్లో కారం చల్లి మరి హత్య చేశారు. ఇక గతేడాది జనవరి 13న పల్నాడులోని మాచర్ల గుండ్లపాడులో మరో టీడీపీ నేతను దారుణంగా చంపారు. నడ్డిరోడ్డు పైనే కిరాతకంగా అందరు చూస్తుండగానే ప్రత్యర్థులు నరికి చంపారు. కడప జిల్లా పొద్దుటూరులో మరో టీడీపీ నేతను వేటకొడవళ్లతో వేటాడారు. గుంటూరు జిల్లాలో ఒక నేత, నెల్లూరు జిల్లాలో శీనయ్య అనే నేతపై దాడిచేసిన వైకాపా నేతలు ఆయన తల పగలగొట్టారు, ఈ ఏడాది జూన్ 5న ప్రకాశం జిల్లా రావివారి పాలెంలో టీడీపీ నేత భార్యను సమీప బంధువైన వైకాపా నేత పొట్టన పెట్టుకున్నారు. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు, టీడీపీ నేత బ్రహ్మంపై దాడి, మరో నేత పట్టాభిపై దాడి.. ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక హత్యల విషయానికి వస్తే పదుల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు హతం కాగా, ఆయా కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డాయి.
ఇక ఏపీ సీఎం జగన్ తీరే ఈ దాడులకు, ఈ హత్యారాజకీయాలకు కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఏకం గా ఏపీ స్పీకర్ కూడా చంద్రబాబును బ్లాక్ క్యాట్ కమాండోలను తీసేసి వస్తే ఖతం అంటూ నేరుగా బెదిరించడం కూడా వైకాపా నేతల మనస్తత్వాన్ని తెలియజేస్తున్నది. ఏపీలో ఈ రాజకీయాలను చూసి, పక్క రాష్ర్టాలు ఛీదరించుకుంటున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదనే అభిప్రాయం వినిపిస్తున్నది. తాజాగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు భద్రతపై కూడా ఇదే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ర్టం రావణ కాష్టంలా మారిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. గతంలో టీడీపీ హయాంలో చంద్రబాబు రాష్ర్టాన్ని హరితాంధ్ర ప్రదేశ్ అంటే, వైసీపీ రాజకీయ కక్షలే రాష్ర్టాన్ని హత్యాంధ్రగా మార్చిందనే అభిప్రాయం వినిపిస్తున్నది.