Chandra Babu : ఏపీలో ఎన్నికల సందడి మొదలైపోయింది. అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలను రచిస్తూ..అమల్లోకి తీసుకొస్తున్నాయి. మరో రెండు నెలల్లో నోటిఫికేషన్ రానుండడంతో సరంజామా సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక టీడీపీ అధినేత ఈసారి ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలని తనదైన వ్యూహాలతో దూసుకెళ్తున్నారు. మిత్రపక్షాలతో కలిసి నడుస్తున్నా.. మరోపక్క కుటుంబ సభ్యులను కూడా రంగంలోకి దించారు.
రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని, మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే ఏపీ భవిష్యత్ అంధకారంగా మారుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో తన రాజకీయ వ్యూహాలను పకడ్బందీగా రచిస్తున్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబు కుటుంబం మొత్తం జనాల్లోకి వెళ్లనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలతో చంద్రబాబు, ఇప్పటికే యువగళంతో లోకేశ్ పాదయాత్ర సైతం పూర్తిచేశారు. అలాగే భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అనే నినాదంతో చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ప్రజాక్షేతంలోకి వెళ్లారు. ఇక ఎన్నికల వరకు కుటుంబ సభ్యులందరూ ఫుల్ బిజీగా మారనున్నారు.
ఈ నెల 5వ తేదీ నుంచి 29తేదీ వరకు చంద్రబాబు వరుసగా బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. మొత్తం 24 రోజుల్లో 25 బహిరంగ సభల్లో పాల్గొనాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చంద్రబాబు బహిరంగ సభల షెడ్యూల్ ను కూడా రిలీజ్ చేశారు. మరోవైపు లోకేశ్ మంగళగిరిలో గెలుపు లక్ష్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు.
తెలుగింటి పండుగ సంక్రాంతి దాక లోకేశ్ మంగళగిరిలోని అన్ని మండలాల్లో పర్యటించనున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమీక్షలు చేయనున్నారు. ఇక భువనేశ్వరి భర్త చంద్రబాబు కోసం రంగంలోకి దిగి చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఈ యాత్ర ద్వారా చంద్రబాబు కోసం మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి.. వారికి రూ.3లక్షల చెక్కును అందించనున్నారు. బాధితుల కుటుంబాలకు టీడీపీ మద్దతుగా ఉంటుందని భరోసా కల్పించనున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ పట్టణం జిల్లాల్లోని బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు.
ఇక ఏపీ ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా చంద్రబాబు కుటుంబం మొత్తం ప్రజాక్షేత్రంలోకి వెళ్లడంపై టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి ప్రయత్నం కచ్చితంగా విజయవంతమవుతుందని ఆకాంక్షిస్తున్నారు.