
RBI withdrawal Rs 2000 note : రూ. 2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కరెన్సీపై ప్రజల్లో కాస్త ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా రూ. 2000 నోట్లు దాచుకున్న వారు కలవరపాటుకు గురవుతున్నారు. ఇక బ్లాక్ మనీ బాబులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. వీటన్నింటి నేపథ్యంలో ఆర్థిక రంగ నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..
నిర్ణయం సరైనదే..
2016లో ప్రధాన మంత్రి నరేందర్ మోడీ డీమానిటైజేషన్ చేసిన సమయంలో రూ. 2000 నోట్లను ఆర్బీఐ వాడుకలోనికి తీసుకచ్చింది. తర్వాత కొంత కాలానికి ఆర్బీఐ ఆ నోట్లను ప్రింట్ చేయడం నిలపివేసింది. అప్పటి నుంచి ఈ నోట్లును కూడా రద్దు చేస్తారని భావించారట ఆర్థిక రంగ నిపుణులు. బ్లాక్ మనీకి చెక్ పెట్టేందుకే రూ. 2000 నోట్లను తీసుకచ్చినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మొదట పాత ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ మోడీ ప్రకటించారు. దీంతో చాలా వరకు బ్లాక్ మనీకి చెక్ పెట్టినట్లు అయ్యింది. ఇక ఆ తర్వాత ఇన్ కమ్ ట్యాక్స్ సూచించిన లెక్క ప్రకారం బ్యాంకులకు వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లను తీసుకువస్తేనే దానికి సమానంగా బ్యాంకులు డబ్బులు ఇస్తాయని చెప్పారు. అక్కడే చాలా వరకు బ్లాక్ మనీకి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇప్పుడు రూ. 2000 కూడా నిలిపివేయడం చాలా మంచిదని అంటున్నారు విశ్లేషకులు.
రాజకీయ నిర్ణయమే..
వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. డీ మానిటైజేషన్ అనేది బ్లాక్ మనీని నిర్వీర్యం చేసేందుకే అని గతంలో ప్రభుత్వం చెప్పింది. అప్పుడు రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేశారు. ఇప్పుడు రూ. 2000 నోట్లు మళ్లీ రూ. 500 కూడా చేస్తారా అన్న సందేహం ప్రజల్లో కనిపిస్తుంది. దీనికి గల కారణాలను కేంద్రం బహిరంగంగా ప్రకటించలేదు. చాలా కాలం నుంచి దాదాపు రూ. 2000 నోట్లను వాడుక నుంచి తగ్గించాయి బ్యాంకులు. అసలే కనిపించకుండా ఉన్న నోట్లను కూడా రద్దు చేయడం అంటే కర్ణాటక ఎఫెక్టే అనుకోవాలని కూడా కొందరు ఆర్థిక నిపుణులు అనుకుంటున్నారు.
రాజకీయ నాయకులు ఎన్నికల్లో డబ్బుల వరద పారిస్తారని అందుకు తగ్గట్లుగా బ్లాక్ మనీని దాచుకున్నారని. దీన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంటే అది ప్రజా స్వామ్యానికి మేలు చేస్తుందనే చెప్పవచ్చు. అయితే దీనిపై రిజ్వర్వ్ బ్యాంక్ బోర్డు కూడా డీమానిటైజేషన్ ఎందుకు అన్నది మాత్రం ప్రజలకు చెప్పాలి. ఆ బాధ్యత బోర్డుపై ఉంటుంది.
బ్లాక్ మనీ కట్టడికి అయితే ఎంతో ఉపయోగం..
రూ. 2000 నోట్లను వెనుక్కు తీసుకోవడం కనుక బ్లాక్ మనీ కట్టడి కోసం అయితే ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. నల్లధనం కట్టడికి ఈ డీమానిటైజేషన్ ఎంతగానో తోడ్పడుతుంది. ఈ నిర్ణయం ఉంటుందని మార్చిలోనే భావించినట్లు నిపుణులు చెప్తున్నారు.
ఆర్బీఐ ‘క్లీన్ నోట్ పాలసీ’ తెచ్చింది. దీని ప్రకారం.. లీగల్ గా, టెండర్ గా ఉండే నోటు 5 లేదంటే 6 సంవత్సరాలకు మించి మన్నికలో ఉండవద్దు. రూ. 2000 నోట్లు చలామణిలోకి వచ్చి దాదాపు ఏడేళ్లు అవుతుంది. కాబట్టి వాటిని చలామణి లేకుండా చూడడం, వాటి స్థానంలో మరో నోటు తేవడమో జరగాలి. గతంలో నోట్ల రద్దుకు ఇప్పుడు చాలా తేడా ఉంది. అప్పుడు ప్రకటించిన తెల్లవారు జామునుంచే నోట్లు చలామణిలో లేకుండా పోయాయి. కానీ ఇప్పుడు ఇలా కాదు. సెప్టెంబర్ 30వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. రూ. 2000 నోట్లు ఉంటే గడువు వరకూ బ్యాంకులకు వెళ్లి కూడా మార్చుకోవచ్చు. ఈ చర్యలతో బ్లాక్ మనీ అరికట్టే వీలు కలుగుతుంది.