TDP Second List : ఏపీలో ఎటూ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. టీడీపీ-జనసేన అభ్యర్థుల ఉమ్మడి జాబితాను పవన్ తో కలిసి ప్రకటించిన చంద్రబాబు రెండో జాబితాను విడిగానే విడుదల చేయబోతున్నారు. రేపు సాయంత్రం టీడీపీ రెండో జాబితా విడుదల చేస్తామని ఇవాళ చంద్రబాబు వెల్లడించారు. జనసేన, బీజేపీ జాబితాలను విడివిడిగా ప్రకటిస్తారని కూడా తెలిపారు. అలాగే బీజేపీతో పొత్తు, ఎన్డీఏలో చేరికపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ఐదేళ్ల కాలంలో 30 ఏండ్ల వెనక్కి వెళ్లిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం ఎంతో అవసరమన్నారు. బీజేపీకి దక్షిణాదిలో సీట్లు తగ్గినా ఉత్తరాదిలో మాత్రం పూర్తి అనుకూలంగా ఉంటుందన్నారు. ఏపీలో తాను గెలిచినా కేంద్రం సహకారం లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. బీజేపీ, జనసేనతో టీడీపీ సీట్ల సర్దుబాటుపై వైసీపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. తాను కూడా గర్వానికి పోకుండా సర్దుకున్నానని చెప్పారు.
రాష్ట్ర ప్రయోజనం కోసమే తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకోలేదన్నారు. హైదరాబాద్ లో ఎకరా అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు. వైసీపీ అధికారం పోకపోతే చాలా మంది హైదరాబాద్ వెళ్తామని అంటున్నారన్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికే పొత్తు పెట్టుకున్నామన్నారు. టికెట్ రానివారికి కొంత బాధ ఉంటుందని, కానీ అధికారంలోకి రాగానే వారికి వివిధ పదవులు ఇస్తామని భరోసా ఇచ్చారు.