
Tolly wood : తెలుగులో ప్రస్తుతం రీమేక్ ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలుకూడా రీమేక్ లకు ఆకర్షితులవుతున్నారు. సులభంగా హిట్ కొట్టాలనే క్రమంలో బొక్కబోర్లా పడుతున్నారు. ప్రస్తుతం అంతా ఓటీటీల ట్రెండ్ కొనసాగడంతో చూసిన సినిమానే మళ్లీ చూడాలని శ్రద్ధ ఎవరికి ఉండటం లేదు. అందుకే సినిమా ఫట్ అవుతోంది. హిట్ మాట దేవుడెరుగు కనీసం యావరేజ్ కు కూడా వెళ్లడం లేదు. దీంతో భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నారు.
చిన్న హీరోలైతే ఫర్వాలేదు. వారి బడ్జెట్ కొద్దిగా ఉంటుంది. దీంతో నిర్మాతకు పెద్దగా ఒరిగేమీ ఉండదు. కానీ పెద్ద హీరో అంటే వారి పారితోషికమే చాటంత ఉంటుంది. ఇక సినిమా వ్యయం తడిసి మోపెడవుతుంది. దీంతో రీమేక్ లను నమ్ముకుని పెడుతున్న పెట్టుబడి బూడిదలో పోస్తున్న పన్నీరుగా మారుతోంది. రీమేక్ లు ఎందుకు నమ్ముకోవడం? మనకు కథలు రాసుకునే సత్తా లేదా?
ప్రపంచానికే కనువిప్పు కలిగే కథలు ఇచ్చిన తెలుగు పరిశ్రమ ఇంత నీచానికి దిగజారిపోయిందా? గతంలో కన్నడ పరిశ్రమ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. అన్ని రీమేక్ సినిమాలు కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. దీంతో తెలుగు, తమిళం, మలయాళం సినిమాలు డైరెక్టుగా కన్నడలో విడుదలయ్యేవి. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. కేజీఎఫ్, శాంతార వంటి సినిమాలు కన్నడ పరిస్థితిని మార్చేశాయి.
మన దగ్గర కూడా మంచి కథలు అందించే వారున్నారు. కానీ ఎందుకో మనవాళ్లకు పరభాషా వ్యామోహం పెరుగుతోంది. అందుకే రీమేక్ లను నమ్ముకుంటున్నారు. కానీ సినిమా బోల్తా కొడితే నిర్మాతకు మాత్రం వాచిపోతుంది. సినిమా వ్యయం భారీగా పెరగడంతో నష్టాల్లో మునిగిపోతున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో ప్రపంచాన్నే ఆకర్షించిన తెలుగు వారి సత్తా ఏమిటో వారికి తెలియడం లేదు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది కాస్త దెబ్బతీసింది. ఇలా పెద్ద హీరోలే పక్క వారి మీద ఆధారపడితే చిన్న నిర్మాతల సంగతేమిటి? మనలో కూడా మంచి రచయితలున్నారు. వారితో తమకు నచ్చిన కథ రాయించుకుని మంచి సినిమాలు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సగటు ప్రేక్షకుడు ఆశిస్తున్నాడు.