
Water Scarcity : ప్రపంచంలో మూడు వంతులు నీరు ఒక వంతు భూమి. భారతదేశానికి మూడు సముద్రాలు, నాలుగోవైపు మంచుకొండలు. జీవనదులు, ఉపనదులు, కాలువలు, ఉపకాలువలు, పంట కాలువలు, కుంటలు, చెరువులు, బోర్లు లెక్కకు రానివి మరెన్నో ! అపార జల సంపద ఉన్న భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి. మహా మహా నదులు కాలుష్యం బారినపడి మరికొన్ని అదృశ్యం అయిపోతున్నాయి.
పాతాళ గంగను పైకి తీసుకురావడానికి భూదేవి గుండెలపై యంత్రాలతో రంధ్రాలు చేస్తున్నారు. మంచు పర్వతాలు సైతం కరిగిపోతున్నాయి. అంటార్కటికా సముద్రంలోని మంచు కనిష్ట స్థాయికి జారిపోయింది. సముద్రంలోని మంచు పలకలు ఛీద్రమైపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎటు చూసినా విధ్వంసం, విపత్తులు. నీటి ఎద్దడి. కారణం – ఎలినినో. పసిఫిక్ సముద్రమే కాదు, 2023లో 90% సముద్ర జలాల ఉపరితలాలు వడగాలులను చవిచూశాయి.
ఎలినినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 2023 మార్చి నుంచి 2024 ఫిబ్రవరి వరకు 12 నెలల కాలంలో పెరిగిన ఉష్ణోగ్రత సగటున 1.56 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది. 2024 లో ఈ ఉష్ణోగ్రత అత్యధిక స్థాయిలో రికార్డు కానున్నదని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది.
ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా 17% ప్రపంచ భూమిలో భారత్ 2.4 శాతం మాత్రమే. దేశ జనాభాలో 48.6% వ్యవసాయం మీద ఆధారపడిన వారు, దేశంలో 14.5 8 కోట్ల రైతు కుటుంబాలు, 38.82 కోట్ల ఎకరాల సాగు చేస్తున్నారు. 2000 నుంచి 2014 వరకు దేశవ్యాప్తంగా 45 శాతం మధ్యతరగతి రైతులు వ్యవసాయం విడిచిపెట్టి పట్టణాలకు మకాం మార్చారు. ఒక్క ఆంధ్రప్రదేశ లోనే 2022-23 సంవత్సరానికి ఖరీఫ్, రబీలో 45 లక్షల ఎకరాలు బీడు పడ్డాయి. పల్లెలలో సాగునీటి సమస్య, పట్టణాల్లో తాగునీటి సమస్యతో పాటు కూడు, గూడు సమస్యలను కూడా పట్టణాలు తలకెత్తుకున్నాయి.
అందుకు చక్కని ఉదాహరణ – సాఫ్ట్వేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బెంగళూరు. కాంక్రీట్ జంగిల్ గా మారిన బెంగళూరులో నీళ్లకు రేషన్ వచ్చింది. ప్రతి కుటుంబం రోజుకి 500 రూపాయలు నీటిపై ఖర్చుపెడుతున్నారంటే, సమస్య తీవ్రతని అర్థం చేసుకోవచ్చు. ప్రజలు నిత్య కృత్యాలు తీర్చుకోవ డానికి షాపింగ్ మల్స్, ఆఫీస్ వాష్రూమ్స్ వాడు కునే దు:స్థితి బెంగళూరులో దాపరించింది.
ఒకప్పుడు మద్రాసులో, ముంబైలో ఈ పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ సంక్షోభం బెంగళూరుని తాకింది. రాజధాని నగరానికి నీటి ఎద్దడి రాకూ డదు అని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి కృష్ణా, గోదావరి నదులను అనుసం ధానం చేశారు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో ప్రముఖంగా చెప్పదగింది మోడీ గురించే.
ప్రధాని కాగానే ఆయన జీవనదుల సంస్కరణకు, గంగానది ప్రక్షాళనానికి పిడికిలి బిగించారు. భారత ప్రధాని మోడీ గ్రామ వికాసానికి ప్రతి కుటుంబానికి గ్యాస్ బండ, ఇల్లు, సురక్షిత కుళాయి నీరు, 3 ఫేస్ కరెంటు, ఇంటర్నెట్, రవాణా కాలువల మరమ్మత్తు, రోడ్లు, విద్య, వైద్య సదుపాయాలతో పాటు వృత్తి నైపుణ్యాలకు పలు పథకాలు ప్రవేశపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ కి కోటానుకోట్ల రూపాయలు మంజూరు చేశారు. స్వావలంబనకు పెద్దపీట వేశారు. ఆ సొమ్ములు ఎక్కడ ఎవరికి ఎంత ఖర్చు చేసింది తేలవలసి ఉంది. ఆ నిధులన్నీ సక్రమంగా వినియోగం అయి ఉంటే సారా అమ్మకాలు, ఇసుక, మట్టి తవ్వకాలను ఆదాయం వనరులుగా మార్చుకునేది కాదు రాష్ట్ర ప్రభుత్వం.
అయితే, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల వైపు దృష్టి సారించలేదు. పంట కాలువలలో పూడిక తీయలేదు. ఇసుక, మట్టి తవ్వకాలు ఆదాయ వనరుగా మల్చుకుంది. ఉదాహరణకు కృష్ణా నది తీరాన ఉన్న విజయవా డ ను గమనిస్తే ప్రకాశం బ్యారేజీ వెనక కృష్ణా నది ఎప్పుడూ నిండు పాడికుండలా కనిపించేది.
ఇప్పుడు నీటిమట్టం ఎంతగా తగ్గిపోయిందంటే పున్నమి, భవాని ఘాట్ల వైపు అడుగుపెట్టలేనం తగా., పున్నమి బోటింగ్ పాయింట్ నుంచి భవాని ద్వీపానికి బోట్లు నిలిపేసేంతగా.. పంట్లను ఒడ్డుకి చేర్చేటంతగా..! పట్టణ, పురపాలక, ఇబ్రహీంప ట్నం, కృష్ణ పరివాహక ప్రాంతాలలో కుళాయిలతో సురక్షిత తాగునీటితో బూడిద వస్తోంది. నీటి కాలుష్యం వలన గుంటూరులో అంటురోగాలు ప్రబలాయి.
గత ప్రభుత్వం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సాయం పథకం కింద 18 తాగునీటి ప్రాజెక్టులు చేపట్టింది. 60-70 శాతం పూర్తయ్యాయి. అంతలో ప్రభుత్వం మారింది. తాగునీటి ప్రాజెక్టులు అంతటితో ఆగిపోయాయి. అమృత్ పథకం కింద ప్రతిపాదించిన 52 ప్రాజెక్ట్లలో ఆరు మాత్రమే పూర్తయ్యాయి.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో తాగునీటి సరఫరా చేసే పైపులు శిథిలం కావడంతో 9.90 కోట్ల రూపాయలతో పునరుద్ధరణ ప్రారంభించారు. 50 శాతం పని పూర్తయింది, ప్రభుత్వం మారింది, పైపుల పునరుద్ధరణ అటకెక్కింది.అలాగే 47.75 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తాగునీటి ప్రాజెక్టు పని ప్రారంభించి 60% పూర్తి చేసింది. తర్వాత కథ మామూలే.. ప్రభుత్వం మారింది, పని ఆగింది. అంబేద్కర్ కోనసీమ, ముమ్మిడివరంలో ఏఐఐబి సాయంతో 115 కోట్ల రూపాయలతో ప్రారంభించిన తాగునీటి ప్రాజెక్టుది అదే కథ..
ఇలా ఊరు ఊరికి ఓ కథ ఉంది, కోట్లాది రూపాయలతో ప్రారంభించిన తాగునీటి ప్రాజెక్టులు దైన్యంగా శిథిలావస్థలో పలకరిస్తుంటాయి. అలాగే గోదావరి జిల్లాలకు కొంగుబంగారమైన ఆక్వా సాగు దీనావస్థాలో ఉంది.
దేశం యావత్తు పెరిగిన ఉష్ణోగ్రతలలో, నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. కానీ 2024 ఎన్నికల నగారా మోగింది.
ఆపధర్మ ప్రభుత్వం, ఎన్నికల హడావిడిలో అధికారగణం!
ఇంకా 50 రోజులకు గాను ఎన్నికలు పూర్తికావు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడానికి మరో రెండు నెలలు పడుతుంది. అంటే దాదాపుగా నాలుగు నెలలు!!ఈ నాలుగు నెలలు ఆంధ్రప్రదేశ్ లోని సాగు తాగునీటి సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి..?
ఉద్యానవన పంటలు ఎండిపోతున్నాయి. ధాన్యం తోలిన రైతులకు చెల్లింపులు అందని దైన్యస్థితి !!
ఇది అన్నపూర్ణ అనదగిన ఆంధ్రప్రదేశ్ క’నీటి’ కథ ..
-తోటకూర రఘు,
ఆంధ్రజ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు