
కేంద్ర ప్రభుత్వం ఏపీపై ప్రస్తుతం వరాల జల్లు కురిపిస్తున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే కేంద్రం ఏపీకి ఇయ్యాల్సిన పాతిక వేల కోట్లను ఇచ్చేసింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. పోలవరం సహా మరే ప్రాజెక్టులకు నిధులు అడగబోమని రాసిచ్చి ఏకంగా రూ పదివేల కోట్లు ప్రత్యేక సాయం తెచ్చుకున్నారు. ఇక అప్పుల పరిమితిలో మరో రూ. 13 వేల కోట్లు వాడుకున్నారు. ఇలా నిధుల వరద ఏపీపై పారుతూనే ఉన్నాయి.
అయితే ఏపీపై సవతి ప్రేమ చూపించిన కేంద్రం ఒక్కసారిగా ఇలా నిధుల వరద కురిపించడంపై అంతా చర్చ సాగుతున్నది. గతంలో అమరావతి నిర్మాణానికి కనీసం రూ వెయ్యి కోట్లు కూడా ఇవ్వకుండా కొర్రిలు పెట్టగా, ఇస్తామని చెప్పి రిలీజ్ చేసిన రూ. 410 కోట్లు కూడా వెనక్కి లాగేసుకుంది. అయితే ఇప్పుడు మాత్రం రాష్ర్ట ప్రయోజనాలు తాకట్టు పెడితే నిధుల వరద పారిస్తున్నదని చెబుతున్నారు.
అయితే ఇదంతా బాగానే ఉన్నా కేంద్రం ఇస్తున్న నిధులు మరి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఇక్కడ చర్చనీయాంశం. పెండింగ్ బిల్లుల చెల్లింపు లేదు.. అభివృద్ధి పనుల జోరు అంతకన్నా లేదు. మరి తెచ్చినవన్ని ఎక్కడికి వెళ్తన్నాయనే చర్చ మొదలైంది. మరోవైపు రైతు భరోసా, అమ్మఒడి లబ్ధిదారులను షరతు పెట్టి తగ్గించేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా నిర్వీర్యం చేశారు. మరి ఖజనాకు చేరుకున్న కోట్ల ఆదాయం ఎక్కడికి వెళ్తున్నదనే అంశంపై స్పష్టత లేదు. రాష్ర్ట అర్థిక వ్యవహారాలన్నీ ఒకరిద్దరి చేతుల్లోనే ఉంటున్నాయి. మరి ఇలా ప్రజాధనమంతా ఎక్కడికి వెళ్తున్నదనే విషయం ఇప్పుడు ఏపీలో చర్చకు వస్తున్నది.