దర్శనం టోకెట్ల రద్దు దిశగా టీటీడీ
Tirumala తిరుమలేశుడిని కాలినడకన దర్శించుకోవాలని వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అలర్ట్ ప్రకటించింది. అలిపిరి మార్గంలో వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల జారీ విషయంలో మార్పులు చేసినట్లు తెలిపింది. రెండు రోజుల క్రితం ఓ బాలికను హతమార్చిన చిరుతను అదే చోట అటవీశాఖ అధికారులు బంధించారు. కాగా శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 25 పైగా చిరుతలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. నడకదారిలో వచ్చే భక్తుల సంఖ్య తగ్గించేందుకు దివ్యదర్శనం టికెట్ల జారీని నిలిపివేసేందుకు టీటీడీ యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
తిరుమలలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలపై టీటీడీ దిద్దుబాటు చర్యలు సిద్ధమైంది. ఓ చిన్నారిని చిరుత బలి తీసుకోవడంతోపాటు తరచూ నడక మార్గంలో వన్యమృగాల సంచారంపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. దీంతో ఆంక్షలు విధించాలని భావిస్తున్నది. భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు.
నడకదారిన వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ భావిస్తున్నది. నడకదారి భక్తులకు జారీ చేసే దర్శన టోకెన్ల విధానాన్ని రద్దు చేసి, సర్వదర్శన టోకెన్లు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. సర్వదర్శనం భక్తులకు ప్రస్తుతం జారీ చేస్తున్న 15 వేల టోకెన్ల సంఖ్యను 30 వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇలా చేయడం ద్వారా భక్తులు దర్శన టోకెన్ కోసం నడకదారి ప్రయాణం తగ్గిస్తారని, మెక్కులు ఉన్న వారే నడకమార్గంలో వస్తారని టీటీడీ భావిస్తున్నది. మరికొన్ని కీలన నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశం ఉన్నది.
ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు..
అలిపిరి నడక మార్గంలో చిన్నారులు తప్పిపోకుండా ట్యాగ్స్ వేయడంతోపాటు చంటి పిల్లల తల్లిదండ్రులకు సూచనలు చేస్తూ, ఆదివారం మధ్యాహ్నం నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల నుంచి అలిపిరి నడక మార్గంలో అనుమతిని రద్దు చేశారు. దీంతో భక్తులు సురక్షితంగా అలిపిరి నడక మార్గం ద్వారా కొండకు చేరుకోవచ్చని టీటీటీ ఆలోచిస్తున్నది. చిరుత సంచరిస్తున్న కారణంగా ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకూ ద్విచక్ర వాహనాలకు అనుమతిని రద్దు చేసింది.
చిరుతల దాడులతో ..
తిరుమల నడక మార్గంలో చిన్నారిపై చిరుత దాడిచేయడంతో టీటీడీ అప్రమత్తమైంది. అయితే ఈ చిరుతలను బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఓ చిరుత బోనులో చిక్కింది.