
నటీనటులు : అడవి శేష్ , మీనాక్షి చౌదరి , రావు రమేష్ , తనికెళ్ల భరణి , పోసాని
సంగీతం : ఎం ఎం శ్రీలేఖ , సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం : మణికందన్
నిర్మాత : ప్రశాంతి
దర్శకత్వం : శైలేష్ కొలను
రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్ : 2 డిసెంబర్ 2022
విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ” హిట్ ”. ఆ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన చిత్రమే ” హిట్ 2 ”. అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే.
కథ :
వైజాగ్ లో సంజన అనే అమ్మాయిని ఓ సైకో అతి కిరాతకంగా చంపుతాడు. ఆ కేసును చేధించడానికి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన కృష్ణదేవ్ ( అడవి శేష్ ) కు అప్పగిస్తారు. ఎలాంటి కేసునైనా అవలీలగా చేధించే కృష్ణదేవ్ ఈ కేసును కూడా వెంటనే పరిష్కరిస్తానని అనుకుంటాడు. అయితే అనూహ్యంగా ఈ కేసు ఛాలెంజ్ గా మారుతుంది కృష్ణదేవ్ కు . దాంతో అహం దెబ్బతిన్న కృష్ణదేవ్ సవాల్ గా తీసుకొని ఆ కిల్లర్ ను పట్టుకునే పనిలో పడతాడు. అసలు ఆ కిల్లర్ ఎవరు ? సంజన ని ఎందుకు కిరాతకంగా చంపాడు ? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
హైలెట్స్ :
అడవి శేష్ నటన
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
నేపథ్య సంగీతం
డ్రా బ్యాక్స్ :
స్లో నరేషన్
నటీనటుల ప్రతిభ :
కృష్ణదేవ్ పాత్రలో అడవి శేష్ తనదైన మార్క్ చూపించాడు. నటనలో ఒక్కో మెట్టు ఎక్కుతూ తనదైన ముద్ర వేస్తున్నాడు. అలాంటి సమయంలోనే లభించిన ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. యాక్షన్ దృశ్యాల్లో కూడా అద్భుతంగా రాణించాడు. ఇక మీనాక్షి చౌదరి పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ లవ్ , రొమాంటిక్ సీన్స్ తో మెప్పించింది. కోమలి ప్రసాద్ , తనికెళ్ళ భరణి , పోసాని , శ్రీకాంత్ అయ్యంగార్ , రావు రమేష్ తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.
సాంకేతిక వర్గం :
విజువల్స్ బాగున్నాయి. మణికందన్ క్రైం థ్రిల్లర్ జోనర్ కు తగ్గట్లుగా చాయాగ్రహణం అందించాడు. ఎం ఎం శ్రీలేఖ , సురేష్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు శైలేష్ కొలను విషయానికి వస్తే …….. క్రైమ్ థ్రిల్లర్ కు కావాల్సిన ట్రీట్ మెంట్ సరిగ్గానే రాసుకున్నాడు. అయితే విలన్ ను మరింతగా పవర్ ఫుల్ గా చూపించి ఉంటే బాగుండు అనే ఓ ఫీలింగ్ కలుగుతుంది. నటీనటుల నుండి సాంకేతిక నిపుణుల నుండి చక్కని పనితనాన్ని రాబట్టుకున్నాడు.
ఓవరాల్ గా :
క్రైమ్ థ్రిల్లర్ చూడాలని అనుకునే వాళ్లకు మంచి ఛాయిస్ …… హిట్ 2.