నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వివివినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” చెన్నకేశవ రెడ్డి ”. 2002 సెప్టెంబర్ 25 న విడుదలైన ఈ చిత్రం పై అప్పట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిన అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడానికి కారణం ఏంటో తెలుసా ……. అంతకుముందు బాలయ్య నటించిన ఫ్యాక్షన్ చిత్రాలు సమరసింహారెడ్డి , నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ లుగా నిలవడమే !
కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత అంటే 20 సంవత్సరాలకు మళ్ళీ 4 K లో చెన్నకేశవ రెడ్డి చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 24 , అలాగే 25 వ తేదీలలో పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా షోలను ఏర్పాటు చేస్తున్నారు నందమూరి అభిమానులు. తెలుగు రాష్ట్రాలలో అలాగే ఓవర్ సీస్ లో కూడా చెన్నకేశవ రెడ్డి చిత్రం రిలీజ్ కానుంది.
ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం పోషించగా టబు , శ్రియ హీరోయిన్ లుగా నటించారు. ఇక మిగిలిన పాత్రల్లో చలపతిరావు , జయప్రకాశ్ రెడ్డి , బ్రహ్మానందం , ఆహుతి ప్రసాద్ , శివకృష్ణ , ఎల్బీ శ్రీరాం తదితరులు నటించారు. మణిశర్మ సంగీతం అందించగా పరుచూరి బ్రదర్స్ రచన అందించారు.