మహానటుడు నటరత్న నందమూరి తారక రామారావు హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ” కేడీ నెం. 1” . కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కె. దేవీవరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కెవి మహదేవన్ సంగీతం అందించాడు. 1978 డిసెంబర్ 15 న విడుదలైన కేడీ నెం. 1 చిత్రం సూపర్ హిట్ అయ్యింది.
హిందీలో మనోజ్ కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం ” దస్ నంబరీ ” చిత్రానికి ఇది రీమేక్. యాక్షన్ ప్రధానంశంగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పటికే ఎన్టీఆర్ – రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ” అడవి రాముడు ” వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రావడంతో కేడీ నెం1 చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే కమర్షియల్ గా బాగా సక్సెస్ అయ్యింది.
ఎన్టీఆర్ సరసన జయసుధ నటించగా కీలక పాత్రల్లో అంజలీదేవి , కైకాల సత్యనారాయణ , ప్రభాకర్ రెడ్డి , జగ్గయ్య , పీజె శర్మ , చలపతి రావు , జయమాలిని , మిక్కిలినేని , ముక్కామల తదితరులు నటించారు. అన్న నందమూరి తారక రామారావు అంటే దర్శకులు కె. రాఘవేంద్ర రావుకు ప్రాణం. దాంతో ఎన్టీఆర్ తో అద్భుతమైన చిత్రాలను చేసాడు. ఇక ఇటీవలే ఈ సినిమా విడుదలై 44 సంవత్సరాలు పూర్తి అవుతుండటంతో అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు రాఘవేంద్ర రావు.