
మాస్ మహారాజ్ రవితేజ మాస్ ఎంట్రీతో కేక పెట్టించాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ” వాల్తేరు వీరయ్య ”. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2023 లో సంక్రాంతి కానుకగా జనవరి 13 న వాల్తేరు వీరయ్య చిత్రం విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా కీలక పాత్రలో రవితేజ కూడా నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో ACP విక్రమ్ సాగర్ గా నటిస్తున్నాడు రవితేజ. దాంతో ఈరోజు రవితేజ ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్నాడు. ఒక చేతిలో మేక పిల్లను పట్టుకొని మరో చేత్తో గొడ్డలి పట్టుకొని ఉన్నాడు రవితేజ. అతడి ముందు గ్యాస్ సిలిండర్ పేలడానికి సిద్ధంగా ఉంది. ఈ పవర్ ఫుల్ స్టిల్ ను మేకర్స్ విడుదల చేసారు. రవితేజ మాస్ లుక్ కు సోషల్ మీడియాలో అప్పుడే విపరీతమైన స్పందన వస్తోంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా రవితేజ లుక్ పై ట్వీట్ చేసి మరింత వైరల్ అయ్యేలా చేసాడు. ఊర మాస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన చిరంజీవి అంటే ఇప్పుడున్న హీరోలకు అందరికీ అభిమానమే ! ఇక మాస్ మహారాజ్ రవితేజకు ప్రాణం. అలాంటి అన్నయ్య సినిమాలో చిన్న పాత్ర లభించినా చాలు అనుకునే రవితేజకు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ దక్కడంతో సంతోషంగా ఒప్పుకున్నాడు. ఈ సంక్రాంతికి థియేటర్ లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి శృతి హాసన్ తో సయ్యాట ఆడుతున్నాడు యూరప్ లో …… అంటే పాటల చిత్రీకరణ జరుగుతోంది అదన్న మాట సంగతి. సరిగ్గా వాల్తేరు వీరయ్య హంగామాకు నెల రోజుల సమయం ఉంది…….గెట్ రెడీ మెగా ఫ్యాన్స్.