
Yatindra Sidda Ramaiah : కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఖాయమైనట్లుగానే కనిపిస్తున్నది. కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నా ట్రెండింగ్ చూస్తుంటే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. అయితే ప్రస్తుతం సీఎం అభ్యర్థి ఎవరనే చర్చ కొనసాగుతున్నది. ఈ క్రమంలో డీకే శివకుమార్ తో పాటు సిద్ధరామయ్య తమ అనుచరులతో కలిసి చర్చలు కొనసాగిస్తున్నారు. అయితే సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర మీడియాతో మాట్లాడారు.
ఆయన ఏమన్నారంటే..
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఖాయమైపోయిందని చెప్పుకొచ్చారు. 120 కి పైగా సీట్లలో పార్టీ గెలుపు దిశగా అడుగులేస్తున్నదని ఆనందంగా చెప్పారు. అయితే తన తండ్రి సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ర్ట ప్రయోజనాల కోసం ఇది తప్పనిసరి అని పేర్కొన్నారు. బీజేపీని అధికారానికి దూరం చేసేందుకు మేం చేయాల్సిందంతా చేశాం. ఇక మాకు మాకు ఏ పార్టీ మద్దతు కూడా అవసరం లేదని చెప్పారు. అయితే యతీంద్ర తన వ్యక్తిగతంగా మాట్లాడరని కాంగ్రెస్ లో ఒక వర్గం చెబుతున్నది. సీఎం ఎవరనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
అయితే పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ కు ఈసారి అవకాశమియ్యాలని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అర్థికంగా ఎంతో సహకరించారని, కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టనా ముందుకు నడిచి, పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. డీకే కూడా సీఎం పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఇప్పుడు కర్ణాటకలో సీఎం పదవి వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అధిష్టానం నిర్ణయానికి అందరూ సమ్మతిస్తారా.. చీలిక వస్తుందా లాంటి అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఏదేమైనా ఈ అంశం సోనియా, రాహుల్ కు పెద్ద తలనొప్పే.