మెడికల్ స్టూడెంట్ దారావత్ ప్రీతి కేసు పలు మలుపులు తిరుగుతోంది.మోతాదును మించి మత్తు ఇంజక్షన్ తీసుకోవడం వల్ల మరణించింది అంటూ చెప్పకొచ్చిన డాక్టర్లు , పోలీసులకు షాక్ ఇచ్చింది టాక్సికాలజీ రిపోర్ట్. దాంతో షాకయిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. ప్రీతి శరీరంలో ఎలాంటి విషం లేదని టాక్సికాలజీ రిపోర్ట్ పోలీసులను నివ్వెర పోయేలా చేసింది.
సైఫ్ మా కూతురుని వేధించడమే కాదు చంపేసి ఇన్ని డ్రామాలు ఆడుతున్నాడని , అతడి వెనకాల కొంతమంది పెద్దలు ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేస్తోంది ప్రీతి కుటుంబం. వాళ్ళు ప్రతీ విషయాన్ని పూసగుచ్చినట్లు చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యుల ఆరోపణలను మొదట్లో పోలీసులు తేలికగా తీసుకున్నారు. ఇప్పుడు టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చాక తాము ఎంత తప్పు చేసామో గ్రహించి తప్పు దిద్దుకునే పనిలో పడ్డారు.
ప్రీతి శరీరంలో ఎలాంటి పాయిజన్ లేదని తేలడంతో అసలు ఆమె ఎలా చనిపోయింది ? హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారా ? దీని వెనకాల ఎవరున్నారు ? ప్రీతి మరణానికి అసలు కారణం ఏంటి ? అనే దిశగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రీతి కుటుంబ సభ్యులు. ఇక ప్రీతి మరణానికి కారణం ఏంటి ? అన్నది తెలియాలంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ రిపోర్ట్ వస్తేనే తెలుస్తుందని భావిస్తున్నారు. ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు సైఫ్ ను నాలుగు రోజుల పాటు విచారించామని , అయితే మరో 2 రోజుల పాటు అనుమతి కావాలని కోర్టును ఆశయించారు పోలీసులు. అయితే అందుకు కోర్టు అనుమతి నిరాకరించడంతో సైఫ్ ను ఖమ్మం జైలుకు తరలించారు.