700 Years Nanda Deepam :
మనదేశంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. వందల సంవత్సరాలు ఆ ఆలయంలో దీపం వెలుగుతూనే ఉంటుంది. ఈ ఆలయం ఎక్కడో కాదు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని గంభీరావుపేట గ్రామంలో ఉంది. ఈ దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. భక్తులు పోసే నూనెతో ఆ దీపం ఇన్నేళ్లుగా వెలుగుతూనే ఉండటం గమనార్హం.
700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలు కలిగినది. ప్రతి ఏటా నవహ్నిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. 18 స్తంభాల చతురస్రాకార మంటపంలో కల్యాణం చేస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణం వైభవంగా జరుపుకుంటారు. గర్భగుడి ముందు గల 16 స్తంభాలతో నిర్మించిన మంటపంలో సీతారాముల కల్యాణం సంప్రదాయబద్ధంగా నిర్వహించి అన్నదానం చేస్తారు.
సీతారామాలయం 1333వ సంవత్సరంలో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. నందాదీపం గత 700 ఏళ్లుగా నిరంతరం దీపం వెలుగుతూనే ఉండటం విశేషం. మూల విగ్రహాల ముందు నందా దీపం ప్రతిష్టించారు. మూల విగ్రహాల ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్టలు జరిగాయి. ఆనాటి నుంచి నేటి వరకు దీపం వెలుగుతూనే ఉంటుందని పూర్వీకులు తెలియజేస్తున్నారు.
నందా దీపం వెలుగుతుండటమే ఆ గ్రామానికి ఐశ్వర్యాలు కలగజేస్తుందని నమ్ముతుంటారు. ఇన్నేళ్లుగా గండ దీపం వెలగడం మమూలు విషయం కాదు. భక్తులు పోసే నూనెతోనే నందాదీపం నిరంతరం వెలుగులీనుతుంది. ఇన్ని విశేషాలున్న ఈ ఆలయాన్ని అందరు సందర్శించి తమ మొక్కులు చెల్లిస్తుండటం విశేషం.