Drug Case : టాలీవుడ్ ను డ్రగ్స్ వీడడం లేదు. ఒక ఘటన తర్వాత మరో ఘటన వరుసగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. చాలా ఏళ్లుగా ఈ మహమ్మారి టాలీవుడ్ ను పీడిస్తూనే ఉంది. మొన్నటికి మొన్న టాప్ హీరోలు డ్రగ్స్ తో పట్టుబడ్డారు. అయితే, ఈ కేసు ఎటూ తేలకపోవడంతో తమకేం అవుతుందని ధీమాతో మరి కొందరు ఈ డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డ్రగ్స్ పట్టుబడినప్పుడల్లా హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప గట్టి చర్యలు తీసుకోవడం లేదని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో మరో తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరో లవర్ డ్రగ్స్ తో పట్టు బడింది. ఇది ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్ గా మారింది.
నార్సింగిలోని ఓ అపార్ట్ మెంట్ పై స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ వోటీ) పోలీసులు సోమవారం (జనవరి 29) జరిపిన దాడిలో నాలుగు గ్రాముల ఎండీఎంఏను టీం స్వాధీనం చేసుకుంది. గోవా నుంచి ఈ డ్రగ్స్ తీసుకొచ్చిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను ఓ టాలీవుడ్ హీరో గర్ల్ ఫ్రెండ్ గా గుర్తించారు. అయితే వారి వివరాలు ఇంకా బయటకు రాలేదు.
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది.