
Taj Mahal in AP : ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయని చెబుతారు. అందులో తాజ్ మహల్ కూడా ఒక వింతగానే పేర్కొంటారు. తాజ్ మహల్ కట్టడం నిజంగా అద్భుతమే. అందుకే దానికి అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉంది. దీని కట్టడం నిజంగా ఓ అసాధారణ ప్రక్రియ. ఆ రోజుల్లోనే అంతటి కళాత్మకంగా నిర్మించారంటే వారి కళా వైభవం గురించి చెప్పాల్సిన పని లేదు.
అలాంటి కట్టడమే మన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలోనూ ఉంది. కాకపోతే దీనికి ప్రాచుర్యం లభించలేదు. ఇది కూడా భార్య జ్ణాపకార్థం నిర్మించిందే కావడం గమనార్హం. తాజ్ మహల్ కు ఇచ్చిన గుర్తింపు దీనికి దక్కకపోవడం విచారకరమే. కానీ ఏళ్లుగా దీని గురించి చాలా మందికి తెలియదు. దీంతో ఇది వెలుగులోకి రాకుండా చీకట్లోనే ఉండిపోయింది.
వైజాగ్ బీచ్ కు అత్యంత సమీపంలోనే ఉండే దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజా వైరిచెర్ల వీరభద్ర బహదూర్ కు అనకాపల్లి జమీందారు గోడే నారాయణ గణపతి రావు రెండో కుమార్తె రాణి నరసాయమ్మ పట్టమహాదేవిని ఇచ్చి 1595లో వివాహం జరిపించారు. పెళ్లయిన ఏడేళ్లకే ఆమె చనిపోయింది. దీంతో జమీందారు ఆమె జ్ణాపకాలతోనే కాలం గడిపారు.
ఆమె గుర్తుగా ఓ మందిరం నిర్మించారు. అందులో ఆమె బొమ్మను చెక్కించారు. ఆయన బతికున్నంత కాలం అదే మందిరంలో జీవితం గడిపారు. భార్యతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూనే ఆయన కాలం చేశారు. దీని నిర్మాణ శైలి కూడా భిన్నంగా ఉంటుంది. ఈ మందిరం నిర్మాణంలో కూడా పలు ప్రాంతాలకు సంబంధించిన కళలు కూడా ఉన్నాయి.
ఈ మందిరానికి ప్రేమ నివేదన రూపం అని పేరు కూడా పెట్టుకున్నారు. కాల క్రమంలో అందులో ఉండే రాణి విగ్రహాన్ని ఎవరో ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం బూత్ బంగ్లాను తలపిస్తోంది. ప్రేమికుల రోజు మాత్రం ఇక్కడకు కొందరు వచ్చి వెళ్తుంటారు. దీన్ని ప్రభుత్వమే పట్టించుకుని పర్యాటక ప్రాంతంగా చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.