KTR : ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆయనపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఆయన సీఎంగా పాలన కొనసాగించి నెల గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. సీఎం మారుతున్నారు.. అంటూ కార్యకర్తల సమావేశాల్లో ఊకదంపుడు ప్రసంగాలు వినిపించారు. ఇక రీసెంట్ గా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
కేటీఆర్ కొన్ని వారాలుగా సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు ఎన్నికైన ముఖ్యమంత్రి కాదని, సీఎం పదవి కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేసిన మేనేజ్ మెంట్ సీఎం అని ఆయన వెర్షన్. ఈ రోజు టీఆర్ఎస్ నేతలతో జరిగిన భేటీలో రేవంత్ పై నిప్పులు చెరిగిన కేటీఆర్ మరోసారి అదే పంథాను అనుసరించారు.
రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదన్నారు. రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా పెట్టుకొని కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లి ఉంటే ఆ పార్టీకి 30 ఎమ్మెల్యే సీట్లు కూడా వచ్చేవి కావన్నారు. అదృష్టవశాత్తు సీఎం పీఠాన్ని దక్కించుకున్న రేవంత్ ను గాలివాటం సీఎంగా కేటీఆర్ అభివర్ణించారు. రేవంత్ కు సీఎం అయ్యేంత హుందాతనం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
సానుభూతి పొందేందుకు ప్రయత్నించకుండా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేత బాధ్యతలను నిర్వర్తించాలని రేవంత్ కేసీఆర్ కు సవాల్ విసురుతుండగా, కేటీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ మాత్రం రేవంత్ తెలంగాణకు సరైన సీఎం కూడా కాదనే వాదనను మోస్తోంది.