
Sonia and Rahul : భాగ్యనగరం రాజకీయంగా వేడెక్కుతోంది. అగ్రనేతల పర్యటనతో టెన్షన్ వాతావరణం పట్టుకుంది. ఓ వైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి అగ్రనేతలు నగరానికి విచ్చేస్తున్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్నారు. దీంతో నగరంలో ఒక్కసారిగా భారీ హీట్ పెరుగుతోంది. సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ నేడు వస్తున్నారు. రేపు అమిత్ షా తెలంగాణ విముక్తి దినోత్సవానికి హాజరవుతున్నారు.
కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ వేదికలు ఏర్పాటు చేయడంతో అగ్ర నేతల సభలు ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రస్తుతం తెలంగాణ మీద ఫోకస్ చేయాలి. కర్ణాటకలో విజయం తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఫోకస్ పెడుతోంది. ఎలాగైనా ఇక్కడ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అధినేతల పర్యటనలు సాగుతున్నాయి.
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని బీజేపీ సంకల్పించింది. రెండు పార్టీలు బహిరంగ సభలకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ తుక్కుగూడలో 10 లక్షల మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. దీంతో ఒకేరోజు రెండు పార్టీల సభలు ఉండటంతో హోరాహోరీగా నిర్వహించనున్నాయి. తెలంగాణ విమోచన వేడుకల కోసం అమిత్ షా హాజరవుతున్నారు.
అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకుని సీఆర్పీఎఫ్ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. బీజేపీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో మాట్లాడతారు. కాంగ్రెస్ తుక్కుగూడలో సభ నిర్వహిస్తుంటే పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో పాల్గొంటారు. సాధ్యమైనంత వరకు జన సమీకరణ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి.