Revanth and Chandrababu : లంచం తీసుకోవడం నేరమే.. ఇవ్వడం కూడా నేరమే. అయినా తీసుకోకుండా పని చేసే ఉద్యోగులు చాలా అరుదనే చెప్పవచ్చు. వారిని పట్టుకునేందుకు ఏసీబీ లాంటి సంస్థలు పని చేస్తున్నాయి. కానీ, నాయకులను పట్టుకునేందుకు ఎలాంటి వ్యవస్థలు లేవు. అందుకే పొలిటీషియన్స్ ఇష్టానుసారంగా దండుకుంటూ అడ్డగోలు ఆర్జిస్తుంటారు.
దీన్ని గమనించిన సుప్రీం కోర్టు సోమవారం (మార్చి 4) కీలక వ్యాఖ్య చేసింది. లంచం కేసుల్లో ప్రజా ప్రతినిధులకు రాజ్యాంగ రక్షణ కల్పించలేమని చెప్పింది. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో నమోదైన ఓటుకు నోటు వ్యవహారం, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబుపై ఇటీవల నమోదైన స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో వీరు ప్రధాన సూత్రదారులని ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. సుప్రీం సంచలన తీర్పు వెలువరించడంతో ఒక రకంగా రేవంత్, చంద్రబాబుకు షాక్ తగిలినట్టయింది.
సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసులో సోమవారం తీర్పు వెలువరించింది. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కేసులో ఇమ్మ్యునిటీ కల్పిస్తూ మెజారిటీ న్యాయవాదులు తీర్పు చెప్పారు. తీర్పును చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. ‘శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు ప్రజల చేత, ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. అలాంటి వారు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలి.
అంతే తప్ప లంచాలు తీసుకుంటూభారత ప్రజాస్వామ్య పని తీరును నాశనం చేయకూడదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ప్రజా ప్రతినిధి లంచం ఎలా తీసుకుంటాడు? అలా లంచం తీసుకునేందుకేనా ఎన్నికైంది. లంచం తీసుకొని శాసనసభ, లోక్ సభలో ఉండడం సరైంది కాదు. అలాంటి తాయిలాలకు అలవాటు పడి ఓటు వేయడం కూడా సరైన చర్య కాదని’ ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరిష్, జేబీ పార్దివాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రా పేర్కొన్నారు.
గతంలో ఓటు కోసం లంచం తీసుకున్నాడన్న ఎమ్మెల్యేపై ఆరోపణల నేపథ్యలో పీవీ నర్సింహారావు కేసులో సదరు ఎమ్మెల్యేకు మినహాయింపు ఇస్తూ పీవీ నరసింహారావు కేసులో అప్పట్లో కోర్టు ఇచ్చిన తీర్పు విస్తృత పరిణామాలను కలిగి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. దీన్ని రద్దు చేస్తున్నామని చెప్పింది. శాసన విధులు నిర్వర్తించేందుకు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మినహాయింపు ఎందుకివ్వాలని ధర్మాసనం ప్రశ్నించింది.
పీవీ కేసులో సుప్రీం తీర్పు 105/194 కు విరుద్ధంగా ఉందని ధర్మాసనం ప్రకటించింది. శాసనాధికారాలను ఎమ్మెల్యేలు, ఎంపీలు గుర్తుంచుకోవాలంది. అధికారం అంటే ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం కాదని.. అలాంటి అధికారాలు చట్టసభకు కూడా ఉంటాయని స్పష్టం చేసింది. 105/194 అధికరణ విచ్చలవిడి వాతావరణం కల్పించిందని ధర్మాసనం అభిప్రాయపడింది.
అవినీతి రాచ పుండని.., ఎమ్మెల్యేలు, ఎంపీలు లంచం తీసుకోవడం పార్లమెంటరీ పనితీరు, ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని నాశనం చేస్తుందని బెంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన తీర్పు రాజ్యసభకు కూడా వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొంది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటే.. అది కూడా అవినీతి నిరోధక చట్టం కిందికి వస్తుందని సుప్రీం ప్రకటించింది.