అభినవ దాన కర్ణుడిగా దేశ వ్యాప్తంగా కొనియాడబడుతున్న వ్యక్తి , సమ్మోహన శక్తి సోనూ సూద్ ను ప్రతిష్టాత్మక అవార్డు ” హ్యూమానిటేరియన్ ఆఫ్ ద ఇయర్ ” వరించింది. ఇటీవల జరిగిన ” మనీ కంట్రోల్ మ్యూచువల్ ఫండ్ సమ్మిట్ 2022 ” వేదికపై సోనూ సూద్ ను ఈ అవార్డుతో సత్కరించారు. కరోనా కష్టకాలంలో ఆపద్భాంధవుడిగా మారాడు సోనూ సూద్.
వలస జీవులను తన స్వంత ఖర్చులతో స్వగ్రామాలకు తరలించాడు……. అంతేకాదు విదేశాలలో ఉన్న పలువురు భారతీయులను కూడా ప్రత్యేక విమానాల్లో ఇండియాకు రప్పించాడు. అలాగే ఆక్సీజన్ కొరతతో పెద్ద ఎత్తున ప్రాణాలు పోతుంటే అలాంటి వాళ్లకు ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్ లను దేశ వ్యాప్తంగా పలువురికి అందించి పెద్ద ఎత్తున ప్రాణాలను నిలిపిన ఘనుడు సోనూ సూద్.
అంతేకాదు ప్రముఖ కంపెనీలతో సోనూ సూద్ టై అప్ అయి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. సినిమాల్లో విలన్ పాత్రల్లో నటిస్తున్నప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా వెలుగొందుతున్నాడు. దాంతో దేశ వ్యాప్తంగా పలు సంస్థలు సోనూ సూద్ ను ఘనంగా సన్మానిస్తూ , అవార్డులతో సత్కరిస్తున్నారు.