నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సంచలన చిత్రం అఖండ. సరిగా ఏడాది క్రితం అంటే 2021 డిసెంబర్ 2 న అఖండ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఏపీలో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే కరోనా మహమ్మారి నుండి కోలుకున్న ప్రజలు పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లడం లేదు కూడా. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో విడుదలైన అఖండ సంచలన విజయం సాధించింది. మార్నింగ్ షో నుండే అఖండ చిత్రానికి పూర్తిగా పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురిసింది.
బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ ల కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడం , బాలయ్య అఖండ గెటప్ అలాగే టీజర్ , ట్రైలర్ ల వల్ల అఖండ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను మించి సినిమా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అఖండ గా బాలయ్య నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. బాలయ్య నటనకు తమన్ నేపథ్య సంగీతం తోడవడంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చాలా థియేటర్ లలో సౌండ్ బాక్స్ లు పాడై పోయాయంటే తమన్ ఎలాంటి నేపథ్య సంగీతం అందించాడో అర్థం చేసుకోవచ్చు.
ఈరోజుల్లో రెండు వారాలు ఆడటమే గగనం అంటే అఖండ ఏకంగా 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. 103 కేంద్రాల్లో 50 రోజులు …….. 4 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు అలాగే షిఫ్ట్ లో 20 కేంద్రాల్లో 100 రోజులను పూర్తి చేసుకుంది. ఇక కర్నూల్ లో దిగ్విజయంగా 200 రోజులను పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించింది. థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మొత్తంగా 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాలయ్య నటజీవితంలో సరికొత్త మైలురాయిగా నిలిచింది. అఖండ విడుదలై సరిగ్గా ఏడాది పూర్తి కావడంతో రాయలసీమలో ఈరోజు అఖండ చిత్రాన్ని స్పెషల్ షోలు వేస్తున్నారు అభిమానులు.