మహానటులు , మహా నాయకులు నందమూరి తారకరామారావు వర్ధంతి ఈరోజే దాంతో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి కుటుంబం ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. అలాగే తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్న నందమూరి అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. 1923 మే 28 న కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు ఎన్టీఆర్. సినిమారంగం మీద మక్కువతో చెన్నపట్నం వెళ్లారు. ఎన్నో కష్టాలు పడి తనని తాను నిరూపించుకొని తెలుగుతెరపై చెరగని ముద్ర వేశారు. నెంబర్ వన్ హీరోగా చరిత్ర సృష్టించారు.
ఎన్టీఆర్ పోషించని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదేమో…… అంతగా తెలుగు తెరను ప్రభావం చేశారు ఎన్టీఆర్. ఇక తనని ఆదరించి అక్కున చేర్చుకున్న తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని భావించి రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా రాణించారు ఎన్టీఆర్. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించారు.
అయితే 1995 లో వెన్నుపోటుకు గురయ్యారు. దాంతో తీవ్ర మానసిక క్షోభతో 1996 జనవరి 18 న గుండెపోటుతో మరణించారు. తెలుగు ప్రజలను శోకసంద్రంలో ముంచెత్తి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అప్పుడే ఎన్టీఆర్ చనిపోయి 27 సంవత్సరాలు కావస్తోంది. దాంతో అన్న నందమూరి తారకరామారావును తల్చుకుంటూ తీవ్ర ఉద్వేగానికి లోనౌతున్నారు.